తిరుమల శ్రీవారి పరాకమణి చోరీ కేసును హైకోర్టు సీఐడీతో పాటు ఏసీబీకి అప్పగించింది. రవికుమార్ అనే ఉద్యోగి దొంగతనం చేస్తూ పట్టుబడితే.. ఆ కేసును లోక్ అదాలత్లో రాజీ చేశారు. ఇలా చేయడం నిబంధనలకు విరుద్ధమని హైకోర్టు స్పష్టం చేసింది. ఈ అంశంపై దాఖలైన పిటిషన్లపై విచారణ జరిపిన హైకోర్టు కీలక ఆదేశాలు జారీ చేసింది.
అసలు పరకామణి చోరీ కేసును ఎలా రాజీ చేశారు.. దీని వెనుక ఎవరు ఉన్నారు.. నిబంధనలకు విరుద్ధంగా ఎందుకు రాజీ చేశారు.. దీని వెనుక లోగుట్టేమిటో తేల్చాలని సీఐడీని ఆదేశించింది. అలాగే రవికుమార్ కు సంబంధించిన ఆర్థిక వ్యవహారాలు, ఆస్తుల లావాదేవీలు, ఎంత కాలం నుంచి దొంగతనాలు చేశారు.. ఆయన ఆస్తులు ఎవరెవరి పేరు మీదకు మారాయన్న అంశంపై దర్యాప్తు చేయాలని ఆదేశించింది.
సీఐడీ, ఏసీబీలు దర్యాప్తును పూర్తి చేసి తదుపరి విచారణ అంటే డిసెంబర్2వ తేదీ కల్లా నివేదికలను కోర్టుకు సమర్పించాలని ఆదేశించింది. డీజీ స్థాయి అధికారి ఇన్వెస్టిగేషన్ ఆఫీసర్ గా ఉండాలని స్పష్టం చేసిది. భక్తులు ఎంతో భక్తితో సమర్పించిన కానుకల్ని ఉద్యోగి దొంగతనం చేస్తే అతని వద్ద కొన్ని ఆస్తుల్ని టీటీడీకి రాపించి రాజీ చేయించడం చాలా అనుమానాస్పదంగా ఉండటంతో హైకోర్టు సీరియస్ గా తీసుకుంది.
