పరకామణి చోరీ కేసును హైకోర్టు సీరియస్ గా తీసుకుంది. సీఐడీ రెండు సీక్రెట్ నివేదికలను ఇప్పటికే కోర్టుకు సమర్పించింది. తాజా విచారణలో ఎఫ్ఐఆర్ నమోదు చేయాలని ఆదేశించింది. రవికుమార్ అక్రమాస్తులపై ఏసీబీతో పాటు.. చోరీ ఘటన, అక్రమంగా రాజీ చేయడం వంటి అంశాలపై సీఐడీ విచారణ కొనసాగించాలని ఆదేశించింది. అలాగే ఫిర్యాదుదారు అయిన సతీష్ కుమార్ అనుమానాస్పద మృతి వివరాలు, పోస్టుమార్టం రిపోర్టును కోర్టుకు సమర్పించనున్నారు.
విచారణలో హైకోర్టులో మరో కీలక ఆదేశాలు జారీ చేసింది. సీఐడీ, ఏసీబీ తమ దర్యాప్తులో వెల్లడయిన సమాచారాన్ని ఆదాయపు పన్ను శాఖతో పాటు ఎన్ ఫోర్స్ మెంట్ డైరక్టరేట్ కు కూడా అందించాలని అదేశించింది. హైకోర్టు ఆదేశాలను బట్టి చూస్తే ఈ కేసు చాలా లోతులకు వెళ్లే అవకాశాలు ఉన్నాయన్న అభిప్రాయం వినిపిస్తోంది. ఓ వైపు పరకామణి కేసు చిన్నదని జగన్ రెడ్డి అంటున్నారు. తాను మహాపాపం చేశానని కానీ తన వెనుక ఎవరూ లేరని దొంగ రవికుమార్ అంటున్నారు.
మరో వైపు ఫిర్యాదుదారు అనుమానాస్పదంగా చినిపోవడం కూడా సంచలనంగా మారింది. ఈ కేసులో సీఐడీ దర్యాప్తులో వెల్లడి అయిన విషయాలు ఏమిటో ఇంకా బయటకు రాలేదు. ఎఫ్ఐఆర్ నమోదు చేస్తున్నందున మెల్లగా అన్ని వివరాలు వెలుగులోకి వచ్చే అవకాశాలు కనిపిస్తున్నాయి. భుజాలు తడుముకుంటున్న వారందరి చరిత్ర వెలుగులోకి వచ్చే అవకాశం ఉంది.
