తెలంగాణలో స్థానిక సంస్థల ఎన్నికల నిర్వహణ విషయంలో కాంగ్రెస్ ప్రభుత్వం సీరియస్ గా లేదు. వివాదాలను చుట్టూ పెట్టుకుని వాయిదాలు వేసుకుంటూ పోతోంది. ఎంతకీ తెమలదు అని తెలిసినా బీసీ రిజర్వేషన్ల చుట్టూ ఓ వలయం ఏర్పాటు చేసుకుని అందులో ఉండిపోతోంది. ఇప్పటికీ.., సాగదీసే ప్రయత్నాలు చేస్తోంది కానీ.. ఏదో విధంగా ఎన్నికలు నిర్వహించాలన్న ఆలోచనకు రావడం లేదు.
సెప్టెంబర్ నెలాఖరులోపు ఎన్నికలు నిర్వహించాలని హైకోర్టు ఆదేశించింది. నిజానికి ఇది. హైకోర్టు ఆదేశం కాదు. ప్రభుత్వం చెప్పిన దాని ప్రకారం ఇచ్చిన ఉత్తర్వులే. నెలలోపు రిజర్వేషన్లు ఖరారు చేస్తామని.. ఆ తర్వాత అరవై రోజుల్లో ఎన్నికలు పూర్తి చేస్తామని చెప్పింది. రాజకీయ వివాదాలు.. పరిష్కారం కాని సమస్యలను చూసుకోవాల్సింది ప్రభుత్వమే. హైకోర్టుకు అలా చెప్పినప్పటికీ ఇప్పటికీ రిజర్వేషన్లు ఖరారు చేయలేదు. ప్రక్రియ ప్రారంభం కాలేదు.
బీసీ రిజర్వేషన్లపై సుప్రీంకోర్టుకు వెళ్లాలని తెలంగాణ ప్రభుత్వం భావిస్తోంది. రాష్ట్రపతి బిల్లులపై నిర్ణయం తీసుకోవడం లేదని పిటిషన్ వేయాలని అనుకుంటున్నారు. అది కాలయాపన చేయడానికే. ఆ పిటిషన్ వేసి.. ఎన్నికల నిర్వహణకు మరింత గడువు కావాలని హైకోర్టును కోరే అవకాశం ఉంది. ఇక్కడ సమస్య హైకోర్టు కాదు.. ఎన్నికలు నిర్వహించకపోవడం. ఆ బాధ్యత ప్రభుత్వంపై ఉంది. కానీ రకరకాల కారణాలతో వాయిదాలు వేసుకుంటూ పోతోంది.
ఫలితంగా క్యాడర్ కు పదవులు లేకుండా పోతున్నాయి. స్థానికసంస్థలకు నిధులు కూడా రావడం లేదు. అదే సమయంలో ఎన్నికలకు భయపడుతున్నారన్న ప్రచారమూ జరుగుతుంది. రాజకీయంగా రిజర్వేషన్లు ఇచ్చి.. ఎన్నికలకు వెళ్లే ఆలోచన సీఎం రేవంత్ చేస్తున్నారు కానీ.. ఆయన ముందడుగు వేయలేకపోతున్నారు.