పొరుగింటి పుల్లకూరకు రుచెక్కువ అన్నారు. వెల కూడా ఎక్కువే అని చిత్రసీమ వాళ్లు ఏనాడో మార్చేశారు. పరాయి భాష నుంచి హీరోల్ని, హీరోయిన్లనీ, ఇతర నటీనటులని, సాంకేతిక నిపుణుల్ని దిగుమతి చేసుకోవడం అనేది అలవాటు నుంచి బలహీనతగా మారిపోయింది. తీసుకొస్తే తీసుకొచ్చారు. కానీ వాళ్లకు ఇచ్చే పారితోషికాలు కూడా ఎక్కువే. ఉదాహరణకు ఓ తమిళ హాస్య నటుడు, తమిళంలో రోజుకి లక్ష పారితోషికం తీసుకొంటున్నాడు అనుకొంటే, అదే నటుడ్ని తెలుగులోకి తీసుకొచ్చి రెండు లక్షలు ఇస్తున్నారు. భాష రాని వాళ్లను పెట్టుకోవడం ఎందుకు… వాళ్లకు అంతింత డబ్బులు ఇవ్వడం ఎందుకు? అనేది చాలామంది తెలుగు నటీనటుల ఆవేదన. సినిమాల బడ్జెట్ లు పెరిగిపోవడానికి ఇది కూడా ఒక కారణమే అని వాదిస్తున్నారు.
ధనుష్కి తమిళంలో రూ.25 నుంచి రూ.30 కోట్ల పారితోషికం అందుతోంది. తెలుగులో ఓ సినిమాకు గానూ.. రూ.50 కోట్లు డిమాండ్ చేస్తున్నట్టు టాక్. ధనుష్ మాత్రమే కాదు.. దాదాపు పర భాషా హీరోలంతా ఇదే పద్ధతి ఫాలో అవుతున్నారు. పోనీ.. అడిగినంత ఇచ్చినా, అదే స్థాయిలో రాబడి ఉంటుందా? అని ఆరా తీస్తే అది కూడా ఉండదు. మరి ఎందుకు ఇంతింత ఇవ్వడం?
దీనిపై ప్రముఖ నిర్మాత ధీరజ్ మొగలినేని తెలుగు 360కి ఇచ్చిన ఇంటర్వ్యూలో విశ్లేషాత్మకమైన వివరణ ఇచ్చారు. కొంతమంది అగ్రశ్రేణి క్యారెక్టర్ ఆర్టిస్టుల డిమాండ్లు వేరుగా ఉంటాయని, అవుడ్డోర్ షూటింగ్ కి రానని తెగేసి చెప్పేస్తారని, వాళ్లకు దూర ప్రయాణాలు చేయడం ఇష్టం ఉండదని, రాను, పోను ఒక రోజు పోతుందని, ఆ రోజు మరో సినిమా షూటింగ్ కి డేట్లు ఇచ్చుకొంటే డబ్బులు గిట్టుబాటు అవుతాయన్న ఆలోచనలో ఉంటారని, వాళ్ల కోసం అవుడ్డోర్ షూటింగులు, ఇండోర్ లో పెట్టుకోలేమని అంటున్నారు. ఇదే సమయంలో పరభాషా నటీనటులు చాలా విషయాల్లో సర్దుకుపోతారని, ఆరు దాటాక కూడా షూటింగ్ చేస్తారని, పని వేళల విషయంలో ఎలాంటి అభ్యంతరాలూ పెట్టరని అంటున్నారు. ”పర భాషా నటీనటులకు మరీ రెట్టింపు పారితోషికాలు ఇవ్వట్లేదు. అక్కడ 5 లక్షలు ఇచ్చే నటుడికి, ఇక్కడ 7 లక్షలు ఇస్తున్నామేమో? అది కూడా నిర్మాతలకు గిట్టుబాటే. ఎందుకంటే.. గంట అటూ ఇటూ అయినా వాళ్లు సెట్లోనే ఉంటారు. పూర్తి సహాయ సహకారాలు అందిస్తారు. అదే మనవాళ్లు ఆరు దాటితే.. అలుగుతారు. ఇళ్లకి వెళ్లిపోయే హడావుడిలో ఉంటారు” అని చెప్పుకొచ్చారు. ఆ లెక్కన.. ఇతర రాష్ట్రాల వాళ్లకు రెట్టింపు పారితోషికాలు ఇచ్చినా తప్పులేదనిపిస్తోంది. పరాయి వాళ్ల డామినేషన్ ఏమిటి? అని మన నటీనటులు దొంగ ఏడుపులు ఏడ్చే బదులు.. నిర్మాతలకు అందుబాటులో ఉంటే సరిపోతుంది కదా? ఈ విషయంలో మారాల్సింది మన నటీనటులే అనిపిస్తోంది.
                                                
				
				
				
				
				
				
				
				
				
				
				
				
				
				
				
				
				
				
				
				
                                              
                                              
                                              
                                              
                                              