నందమూరి బాలకృష్ణ గౌతమిపుత్ర శాతకర్ణి సినిమాపై భారీ అంచనాలున్నాయి. బాలయ్య వందో చిత్రమిది. దానికి తోడు సంక్రాంతికి విడుదల అవుతోంది. ఈ కథని దర్శకుడు క్రిష్.. సినిమాటిక్, కమర్షియల్ యాంగిల్లోనే తీస్తున్నాడు. గ్రాఫిక్స్కీ చోటున్న సినిమా ఇది. అయితే.. ఎమోషనల్ యాంగిల్ పై మాత్రం క్రిష్ తన పట్టు చూపించే ప్రయత్నం చేశాడని తెలుస్తోంది. ఈ సినిమాపై అటు బాలయ్య, ఇటు క్రిష్ ధీమాగా ఉన్నారు. ఏ సినిమాకైనా నాలుగైదు సీన్లు పీక్ లో ఉంటే సినిమా హిట్టే అని చెబుతుంటారు. అది నిజం కూడా. ఏ సూపర్ హిట్ సినిమా చూసినా.. అందులో గొప్ప సీన్లు లెక్కేస్తే నాలుగో అయిదో కనిపిస్తాయంతే. గౌతమి పుత్రలో మాత్రం అంతకు మించి హృదయాన్ని హత్తుకొనే సన్నివేశాలున్నాయని తెలుస్తోంది. గౌతమి పుత్ర విజయానికి ఈ సీన్లే కీలకమని సమాచారం. ఈ సన్నివేశాలు థియేటర్లో క్లిక్ అయితే… గౌతమి పుత్ర రేంజ్… మరో స్థాయిలో ఉంటుందని విశ్వసనీయ వర్గాలు చెబుతున్నాయి.
- గౌతమిపుత్ర కథలోకి ప్రేక్షకుల్ని తీసుకెళ్లే సన్నివేశాలు రోమాలు నిక్కబొడిచేలా ఉంటాయని తెలుస్తోంది. బాలకృష్ణను చూపించకుండానే గౌతమిపుత్ర ఘనత, తన వీరత్వం ప్రేక్షకులకు అర్థమయ్యేలా కొన్ని సన్నివేశాల్ని డిజైన్ చేశాడట క్రిష్. అవి బాలయ్య అభిమానుల్ని తప్పకుండా మెప్పిస్తాయని సమాచారం.
- కోట లోకి శత్రువుల ముఠా ప్రవేశించి.. గౌతమిపుత్ర ని హతమార్చడానికి ప్రయత్నిస్తుంది. అందులో పదిమంది యుద్ద వీరులు పాల్గొంటారు. ఒక్కొక్క సైనికుడు తొమ్మిది అడుగుల పొడవు.. అందుకు తగిన భారీ కాయం. వాళ్లతో బాలకృష్ణ పోరాడిన సన్నివేశం మరో హైలెట్.
- యుద్ద వ్యూహాలు, యుద్ద సన్నివేశాలు కొత్తగా కనిపించనున్నాయి. సైనికులుగా నటించినవాళ్లంతా జార్జియా దేశస్తులే. వాళ్ల రూపు రేఖలు, పోరాట పటిమ ఈ చిత్రానికి మరింత వన్నె తీసుకొస్తాయని సమాచారం.
- బాలకృష్ణ – శ్రియ మధ్య సాగే సెంటిమెంట్ సీన్లు మరో ప్రధాన ఆకర్షణగా నిలవనున్నాయి. అమ్మ, భార్య గొప్పదనాన్ని చెప్పే డైలాగులు ఈ చిత్రానికి ప్రాణం పోశాయని చెబుతున్నారు.
- కన్నడ సూపర్ స్టార్ శివ రాజ్ కుమార్ ఓ కీలక పాత్రలో కనిపించనున్నాడు. ఆయనపై క్రిష్ ఓ బుర్ర కథ డిజైన్ చేశాడు. ఇక్కడి నుంచే కథ మరో మలుపు తీసుకొంటుంది. ఆ సన్నివేశాన్ని కూడా ఉద్వేగభరితంగా తీర్చిదిద్దాడట క్రిష్.
- గౌతమిపుత్ర శాతకర్ణి తన జీవితంలో కీలకమైన యుద్దానికి వెళ్తు వెళ్తూ తల్లి, భార్య, తన సైన్యాన్ని ఉద్దేశించి మాట్లాడే మాటలు రోమాలు నిక్కబొడుచుకునేలా చేస్తాయని చెబుతున్నారు.
- క్లైమాక్స్ సన్నివేశాలు ఈ చిత్రానికి ప్రాణం పోశాయి. తెలుగుజాతి, భారతీయ తత్వం, ఇక్కడి త్యాగ నిరతి, క్షమించే గుణం వీటి గురించిన సంభాషణలతో ఎమోషనల్ క్లైమాక్స్ ని డిజైన్ చేశాడట క్రిష్.
ఈ సన్నివేశాలపై క్రిష్ బృందం ఎన్నో ఆశలు పెంచుకొంది. గౌతమి పుత్ర జాతకాన్ని నిర్ణయించే సన్నివేశాలివి. ఇవి క్లిక్కయితే… సినిమా సూపర్ హిట్ అవ్వడం ఖాయం. అలా అవ్వాలని కోరుకొందాం….