పవన్ కల్యాణ్ హిందీ భాషపై చేసిన వ్యాఖ్యల గురించి నాలుగైదు రోజులు సోషల్ మీడియాలో చర్చించుకున్నారు. సెటైర్లు వేసుకున్నారు. పిట్ట కథలు రాసుకున్నారు. అమ్మ, పెద్దమ్మ మధ్య పోలికలు పెట్టుకుని జోకులేసుకుని మానసిక ఆనందం పొందారు. ఇప్పుడు నారా లోకేష్ మీద పడ్డారు. ఆయన హిందీని ఓ ఇంటర్యూలో జాతీయ భాష అని చెప్పారని.. కొంత మంది రెచ్చిపోతున్నారు. ఇందులో టీడీపీ కార్యకర్తలు కూడా ఉన్నారు. టీడీపీని అభిమానించేవారు ఉన్నారు. అధికార భాష జాతీయ భాష అనే మాటల మధ్య కన్ ఫ్యూజన్ ఉండే ఉండవచ్చు కానీ.. ఆ ఇంటర్యూలో కానీ మరెక్కడైనా కానీ.. హిందీ భాష నేర్చుకోవాల్సిందేనని నారా లోకేష్ చెప్పలేదు.
హిందీని వ్యతిరేకించవద్దనే చెబుతున్న నారా లోకేష్
త్రిభాష విద్యావిధానంలో మూడో భాషగా మాత్రమే హిందీ ఉంటుంది. అది కొత్తగా లేదు. ముఫ్పై ఏళ్ల కిందట కూడా మూడో భాషగా హిందీ ఉంది. తెలుగు, ఇంగ్లిష్ , హిందీ అనేది త్రిభాషా విధానం ఎప్పటి నుంచో ఉంది. నేర్చుకున్న వారు నేర్చుకుంటున్నారు. లేని వాళ్ల లేదు. ఎవరిపైనా బలవంతంగా హిందీ భాషను రుద్దడం లేదు. ఇతర దక్షిణాది రాష్ట్రాల్లో భాషను రాజకీయం చేస్తున్నారు కాబట్టి.. ఇక్కడ అలాంటి రాజకీయం చేయవద్దని హిందీ విషయంలో ఎలాంటి వ్యతిరేకత లేదని చెబుతున్నారు. పవన్ కల్యాణ్ అదే చెబుతున్నారు.. నారా లోకేష్ అదే చెబుతున్నారు. కానీ వారు హిందీ నేర్చుకోవాల్సిందేనని చెప్పడం లేదు.
ఎవరికి ఇష్టం వచ్చిన భాష వారు నేర్చుకోవచ్చు !
దేశంలో భాషా స్వేచ్ఛ ఉంది. ఎవరికి ఇష్టం వచ్చిన భాషను వారు నేర్చుకోవచ్చు. హిందీని మాత్రమే ఎందుకు వివాదం చేస్తున్నారో కానీ అది బీజేపీ సొంత ఆస్తి అయినట్లుగా ప్రచారం చేస్తున్నారు. హిందీ నేర్చుకోవడం అంటే బీజేపీని సమర్థించడం కాదు. అది జాతీయ భాష కాకపోవచ్చు కానీ.. దేశంలో ఎక్కువ మంది మాట్లాడే భాష. అది నేర్చుకోవాల్సిన అవసరం కూడా లేదు. ముఖ్యంగా చదవడం నేర్చుకోవాల్సిన అవససం లేదు. రాయడం నేర్చుకోవాల్సిన అవసరం లేదు. మాట్లాడటం నేర్చుకుంటే సరిపోతుంది. కానీ మాతృభాషను మాత్రం ఖచ్చితంగా రాయడం, చదవడం, మాట్లాడటం నేర్చుకోవాలి.
ఏదైనా నేర్చుకుంటే పెరిగేది జ్ఞానమే.. తగ్గదు !
ప్రస్తుతం హిందీని వ్యతిరేకించవద్దని చెబుతున్న నారా లోకేష్, పవన్ కల్యాణ్.. హిందీని నేర్చుకోవాలని బలవంతం చేయడం లేదు. కేవలం నేర్చుకుంటే.. వారధిగా ఉపయోగపడుతుందని అంటున్నారు. ఏదైనా నేర్చుకుంటే జ్ఞానం పెరుగుతుంది కానీ తగ్గిపోదు. హిందీని నేర్చుకుంటే తెలుగును మర్చిపోరు.. ఇంగ్లిష్ ను మర్చిపోరు. భాషా రాజకీయాల ట్రాప్ లో పడి.. అసలు విషయాన్ని మర్చిపోతున్నారు. ఆ హిందీతో తెలుగు రాష్ట్రాలకు ముఖ్యంగా ఏపీకి సంబంధం లేదు. దాంతో రాజకీయం చేయాల్సిన అవసరం లేదు.