స్థూలంగా చూస్తే హిందూపురంలో చోటు చేసుకుంటున్న రాజకీయ పరిణామాలు చాలా చిన్నవిగానే కనిపిస్తాయి. నందమూరి బాలకృష్ణ నియోజక వర్గంలో ప్రస్తుతం హాట్ టాపిక్‌గా మారింది పి.ఎ. వివాదం. ఒక ఎమ్మెల్యే పీయేకి వ్యతిరేకంగా ఏకంగా పార్టీ నాయకులే గళమెత్తుతూ ఉండటం ప్రత్యేక పరిస్థితి! ఒక పీయే వ్యవహారం తెలుగుదేశం పార్టీలో ఎందుకింత కీలకంగా మారుతోంది..? గడచిన రెండున్నరేళ్లుగా ఆ పీయే గురించి బాలయ్యకు తెలియదా..? ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడుకి ఇంతవరకూ తెలీదా..? స్థానికంగా కొందరు నాయకులు ఈ వ్యవహారాన్ని ఇంత ప్రతిష్టాత్మకంగా తీసుకోవాల్సిన పరిస్థితి ఎందుకొచ్చింది..? చంద్రబాబుకి ఫిర్యాదు చేస్తే సరిపోయేది కదా..! ఇలాంటి అనుమానాలన్నీ ఇప్పుడు వ్యక్తమౌతున్నాయి. ఇదంతా ఏదో వ్యూహాత్మం అనే విశ్లేషణలూ వినిపిస్తున్నాయి.
ఈ వ్యవహారం ఇంతగా ముదురుతున్న నేపథ్యంలో అందరి దృష్టీ ముఖ్యమంత్రి పైనే మళ్లుతోంది! హిందూపురం వ్యవహారంలో చంద్రబాబు జోక్యం చేసుకున్నట్టా… లేనట్టా అనే అనుమానం కలుగుతోంది. పార్టీలో ఏ చిన్న పంచాయితీ అయినా దగ్గరకి వెళ్లిపోతుంది కదా. అలాంటిది, స్థానికంగా ప్రముఖ నేతలు రహస్య సమావేశాలు నిర్వహించుకోవడం, పీయే తీరుకు వ్యతిరేకంగా సభలకు ప్లాన్ చెయ్యడం… ఇవన్నీ చంద్రబాబుకు తెలియకుండా జరుగుతున్నాయా అనేది ప్రధానమైన ప్రశ్న..?
నిజానికి, హిందూపురంలో బాలయ్య అనూహ్యంగా పట్టుసాధించారన్నది వాస్తవం. వచ్చే ఎన్నికల నాటికి రాజకీయంగా మరింత క్రియాశీలకంగా మారే ఛాన్స్ ఉంది. ఇదే మాట బాలయ్య చెప్పిన సందర్భాలు చాలానే ఉన్నాయి. ఆయన యథాలాపంగా ఆ మాటలు చెప్పినా.. ఎవరికి తగలాలో వారికి కాస్త గట్టగానే తగులుంటాయి కదా! ఓ పక్క సినిమాల్లో బిజీగా ఉంటున్నా కూడా హిందూపురం ప్రజలకు బాలయ్య అందుబాటులో ఉంటారనే ఇమేజ్ సంపాదించుకున్నారు. ప్రస్తుతానికి ఏ పదవీ ఆశించిక పోయినా.. వచ్చే ఎన్నికల్లో క్రియాశీల పాత్ర పోషించేందుకు ఆయన నూటికి నూరు శాతం అర్హుడు అనే అభిప్రాయం పార్టీలోనే వినిపిస్తోంది..!
ఇవన్నీ ఒకెత్తు అయితే… ముఖ్యమంత్రి తనయుడు త్వరలోనే మంత్రి కాబోతున్నట్టు మళ్లీ వినిపిస్తోంది. రాబోయే రెండేళ్లలో లోకేష్‌ను పార్టీపరంగా కీలకం చేయడం చంద్రబాబుకు చారిత్రక అవసరం. ఇలాంటి తరుణంలో హిందూపురంలో చోటు చేసుకుంటున్న పరిణామాల వెనక ఇంకేదో వ్యూహం ఉందనే అనుమానాలు బలపడుతున్నాయి. ఈ వ్యవహారంలో చంద్రబాబు జోక్యం చేసుకుని ఉంటే ఇలాంటి వినిపించేవి కావు. అత్యంత క్రమశిక్షణ కల్గిన పార్టీలో అధిష్టానానికి సమాచారం లేకుండా నాయకులు సమావేశాలు నిర్వహించుకోవడం దేనికి సంకేతం..? ఈ పరిణామాలన్నీ నైతికంగా మానసికంగా బాలయ్యను బలహీన పరచేవిగానే కొంతమంది చూస్తున్నారు!