HIT3 Movie Telugu Review
తెలుగు360 రేటింగ్: 2.75/5
ప్రతీ హీరోకీ ఓ ఇమేజ్ ఉంటుంది. తనకంటూ ఓ అభిమానగణం ఉంటుంది. వాళ్లని సంతృప్తిపరచుకొంటూ సినిమాలు చేసుకొంటూ పోతే.. విజయాలొస్తాయ్. సేఫ్ జోన్లో ఉండొచ్చు. కానీ మరో మెట్టు పైకి వెళ్లాలంటే ఆ ఇమేజ్‌ని, తన సేఫ్ జోన్నీ దాటుకొని రావాలి. ప్రస్తుతానికి నాని అదే చేస్తున్నాడు. నానిపై ఉన్న ‘క్లాస్’ ఇమేజ్‌ని పక్కన పెట్టి తనలోని మాస్ మంత్రని బయటకు తీసుకొచ్చే ప్రయత్నం చేస్తున్నాడు. ‘దసరా’ దానికి పెద్ద ఉదాహరణ. ఇప్పుడు ‘హిట్ 3’ని అదే జోన్లో పెట్టొచ్చు. ‘నా సినిమాని పిల్లలు, ఆడవాళ్లూ చూడకండి’ అని నానినే స్టేట్మెంట్ ఇచ్చాడంటే తన నుంచి ఈసారి ఎలాంటి ప్రొడెక్ట్ వచ్చిందో ఊహించొచ్చు. హిట్ ఫ్రాంచైజీలో వచ్చిన మూడు సినిమాల్లో ఎక్కువ బజ్ ఉన్న సినిమా ఇది. ఎక్కువ ఖర్చు పెట్టిన సినిమా కూడా ఇదే. మరి ఈ బజ్‌ని నాని నిలబెట్టుకొన్నాడా? అర్జున్ సర్కార్‌లో ఉన్న మాస్ ఎంత?
అర్జున్ సర్కార్ (నాని) ఓ సిన్సియర్, సీరియస్ పోలీస్ ఆఫీసర్. దేశ వ్యాప్తంగా 12 మర్డర్లు జరుగుతాయి. అదంతా ఓకే పేట్రన్‌లో సాగిన హత్యలు. వీటి వెనుక ఎవరున్నారు? వాళ్లని అర్జున్ సర్కార్ ఎలా పట్టుకొన్నాడు అనేదే కథ.
‘హిట్ 3’ కథని రెండు వాక్యాల్లో ముగించొచ్చు. కానీ తెరపై ఈ కథని చూపించిన పద్ధతి వేరు. అర్జున్ సర్కార్ అనే క్యారెక్టర్ని పరిచయం చేసిన విధానంలోనే ప్రేక్షకులు ఎలాంటి సినిమా చూడబోతున్నారన్న హింట్ ఇచ్చాడు దర్శకుడు. చాగంటి వారి ప్రవచనాలు వింటూ.. సైకోలా మారి ఓ హత్య చేస్తాడు అర్జున్ సర్కార్. ఓ పోలీస్ ఆఫీసర్ క్యారెక్టర్ ని ఇలా పరిచయం చేయడం.. తాను చేసిన మర్డర్లు తానే ఇన్వెస్టిగేషన్ చేస్తున్న హీరోని చూడడం ఇవన్నీ… సినిమా మొదలైన పది నిమిషాలకే ప్రేక్షకుల్ని కుర్చీలకు అతుక్కుపోయేలా చేస్తాయి. జుమ్మూ కాశ్మీర్లో అర్జున్ సర్కార్ డీల్ చేసిన ఓ మర్డర్ మిస్టరీతో అసలు కథ మొదలవుతుంది. అక్కడ్నుంచి ఇన్వెస్టిగేషన్ డ్రామా రన్ అవుతుంది. హిట్ 1, హిట్ 2లో ఇన్వెస్టిగేషన్‌కి ఎక్కువ స్కోప్ ఉంటుంది. అసలు హంతకులు ఎవరు? హత్యలు ఎందుకు చేస్తున్నారు? అనే కోణంలో ఆ కథల్ని నడిపాడు శైలేష్ కొలను. కానీ ‘హిట్ 3’కి వచ్చే సరికి ప్యాట్రన్ మారిపోయింది. ‘హిట్ 3’లో ఇన్వెస్టిగేషన్‌కి ఇచ్చిన స్కోప్ చాలా తక్కువ. దానికంటే హీరో క్యారెక్టరైజేషన్, తన యాక్షన్.. వీటిపైనే ఎక్కువ ఫోకస్ చేశాడు దర్శకుడు. నాని లాంటి స్టార్ ఇమేజ్ ఉన్న నటుడికి ఈ ప్యాట్రనే కరెక్ట్ అనిపిస్తుంది కూడా.
శైలేష్ ఎంచుకొన్న థీమ్ లో పొటెన్షియాలిటీ వుంది. వరుసగా జరిగే హత్యలు, అన్నీ ఒకే పేట్రన్‌లో సాగడం అనేది చాలా కామన్ పాయింట్. దానికి ఓ చైన్ లింక్ ని జోడించడం, దానికి `సీటీకే` అనే పేరు పెట్టడం, స్క్విడ్ గేమ్ తరహాలో సైకోలు అందర్నీ ఒకేచోట పోగేసి.. వాళ్లతో గేమ్ ఆడించడం.. ఇదంతా కొత్తగా అనిపిస్తుంది. ఇన్వెస్టిగేషన్ థ్రిల్లర్ సినిమాల్లో కనిపించే ట్విస్టులు, టర్న్‌లు ఈ సినిమాలో కూడా ఉంటాయని ఆశ పడేవాళ్లకు ‘హిట్ 3’ అంతగా రుచించకపోవొచ్చు. కానీ యాక్షన్‌ని మాత్రమే కోరుకొనేవాళ్లకు నాని కావల్సినంత సరంజామా అందించేశాడు. ముఖ్యంగా విలన్ డెన్లోకి అడుగుపెట్టిన తరవాత అర్జున్ సర్కార్ సాగించే రక్త యాత్ర చూడాల్సిందే. ఆయా సన్నివేశాల్లో హింస మితిమీరిందని అనిపించొచ్చు. కానీ ఈ జనరేషన్ అలాంటి రక్తకాండ చూడడానికి బాగా అలవాటుపడిపోయారు. పైగా నాని టార్గెట్ ఆడియన్స్ కూడా వాళ్లే కాబట్టి.. ఓరకంగా నాని టార్గెట్ రీచ్ అయినట్టే.
దర్శకుడు శైలేష్ చేసిన తెలివైన పని.. లవ్ స్టోరీని కొన్ని సన్నివేశాలకే పరిమితం చేయడం. దాంతో పాటు సెకండాఫ్‌కి వచ్చేసరికి హీరోయిన్ క్యారెక్టర్ ని కథలోకి లాక్కుని రావడం. పాటల్ని పరిమితం చేయడం కూడా మంచి ఫలితాన్నే అందించింది. క్లైమాక్స్ లో ట్విస్టులేని లోటుని ‘అడవిశేష్’ పూర్తి చేశాడు. చివర్లో పార్ట్ 4లో ఎవరు కనిపిస్తారో అర్థమైపోయింది. కార్తీ ఎంట్రీ… ‘నేను బైలింగ్వల్’ అని చెప్పడం.. థియేటర్‌కి కిక్ ఇస్తుంది. తెలంగాణ, ఆంధ్రాపై నాని చెప్పిన ఓ డైలాగ్ థియేటర్లో మోత మోగిస్తుంది. ఇలాంటి కొన్ని తళుకులు అక్కడక్కడ కనిపిస్తుంటాయి.
తాను ఈ సినిమాని ఎవరికి కేటర్ చేయబోతున్నాడో నాని ముందే చెప్పేశాడు. ఆడిటోరియం కూడా అలెర్ట్ అయిపోయింది. అందుకే సినిమాలో కొన్ని బూతులు యదేచ్ఛగా వచ్చేస్తున్నా, తండ్రీ కొడుకుల మధ్య సంభాషణ కూడా ఓచోట హద్దు దాటేసినా, హింస పేరుకుపోయినా… ‘ముందే చెప్పారుగా’ అని సర్దుకుపోవొచ్చు. నానిలో కుటుంబ ప్రేక్షకులు ఇష్టపడే కంటెంట్ ఇందులో లేదు. ఈ విషయంలో ఎలాంటి అనుమానం లేదు. వాళ్లు కాస్త ఇబ్బంది పడే అవకాశం ఉంది. పైగా ఈ తరహా కథలు, నేరేషన్ అందరికీ ఎక్కకపోవొచ్చు. ఆ పరిమితులు ‘హిట్ 3’కి ఉన్నాయి.
నాని అర్జున్ సర్కార్ క్యారెక్టర్లో ఒదిగిపోయాడు. ఇది తనకు ఛేంజ్ ఓవర్. చిన్న చిన్న ఎక్స్ప్రెషన్స్, మూడ్ ఛేంచ్స్ నాని భలే ఇచ్చాడు. దాన్ని బట్టే ఈ క్యారెక్టర్ని తాను ఎంత బాగా ఓన్ చేసుకొన్నాడో అర్థం అవుతుంది. ‘నేను క్లాస్ అనుకొని ఇంతకాలం భ్రమపడ్డారు’, ‘నా కెరీర్ బిగినింగ్ నుంచి వింటున్నా ఈమాట’ లాంటి డైలాగులు నాని సినిమా కెరీర్‌ని అన్వయించుకొని అర్థం చేసుకొంటే ఇంకాస్త కిక్ ఇస్తాయి. శ్రీనిధి శెట్టిని ఫస్టాఫ్‌లో చూసినప్పుడు ‘ఈ సినిమాకు హీరోయిన్ అవసరమా’ అనిపిస్తుంది. కానీ సెకండాఫ్‌లో చూస్తే.. ‘అవసరమే’ అనే ఫీలింగ్ కలుగుతుంది. తనలో ఇంకో కొత్త కోణం ఈ సినిమాలో కనిపిస్తుంది. హీరోతో పోలిస్తే విలన్ బాగా వీక్ అయిపోయాడు. ప్రతీక్ బబ్బర్ నటనలోనూ, ఆహార్యంలోనూ నానికి ధీటుగా కనిపించలేదు.
యాక్షన్‌కి పెద్ద పీట వేసిన సినిమా ఇది. ముఖ్యంగా క్లైమాక్స్ లో దాదాపు 30 నిమిషాలు నరుకుడే. వాటిని మరీ ఏవగింపు కలగకుండా బాగా డిజైన్ చేశారు. కశ్మీర్లో తెరకెక్కించిన సీన్లు, అటవీ నేపథ్యంలో తీసిన సన్నివేశాలు, స్క్విడ్ గేమ్ తరహాలో రూపొందించిన యాక్షన్ సీన్లు ఇవన్నీ తెరపైకి బాగా వచ్చాయి. మరీ పది నిమిషాలకు ఓ హై సీన్, ట్విస్టులు ఆశించే వాళ్లకు ‘హిట్ 3’ కాస్త నిరాశ కలిగిస్తుంది. నానిలో మాస్ ఫీస్ట్ చూడాలనుకొని ప్రిపేర్ అయిపోయి వెళ్లిన వాళ్లకు మాత్రం ఈ అర్జున్ సర్కార్ అన్ని విధాలా సంతృప్తి పరుస్తాడు.
తెలుగు360 రేటింగ్: 2.75/5