కేరళ, కర్ణాటక వంటి రాష్ట్రాల్లో సుందరమైన ప్రకృతి ప్రదేశాల పర్యాటక ప్రాంతాలకు వెళ్లినప్పుడు చాలా మంది హోటళ్లలో బస చేయరు. అక్కడి గ్రామస్తులు, టౌన్లలోని వాళ్లు హోమ్ స్టే సౌకర్యం కల్పిస్తారు. అంటే.. వారి ఇళ్లలోనే ఒకటి, రెండు గదులు హోం స్టే కోసం కేటాయిస్తారు. వాటిని అద్దెకు ఇస్తారు. పర్యాటకులు వచ్చి ఆ ఇళ్లల్లో ఉండి అద్దెలు చెల్లిస్తారు. హోం స్టే ఫీలింగ్ ఉంటుంది. అందుకే ఇలాంటి వాటికి అక్కడ బాగా ఆదరణ ఉంటుంది. ఆయా ప్రాంతాల వారికి ఆదాయం వస్తుంది.
ఇప్పుడు ఈ పద్దతిని ఏపీకి తీసుకు వచ్చి పర్యాటకుల్ని ఆకర్షించడమే కాకుండా ప్రజలకు ఆదాయ వనరుల్ని పెంచాలని ఏపీ ప్రభుత్వం నిర్ణయించింది. కోనసీమ వంటి ప్రాంతాలతో పాటు విశాఖ వంటి హై టూరిస్ట్ డెస్టినేషన్స్ లో కూడా ఇలాంటి హోమ్ స్టే కు అవకాశం కల్పించాలని నిర్ణయించారు. విశాఖపట్నం వచ్చే పర్యాటకులకు ‘ఇంటిలో ఆతిథ్యం’ ఇవ్వాలనుకునేవారికి రిజిస్ట్రేషన్లు ప్రారంభించారు. ఎవరికైనా సొంత ఇల్లు, విల్లా , అపార్టుమెంట్ ఫ్లాట్ ఉండి, వాటిని పర్యాటకులకు రోజువారీ పద్ధతిలో అద్దెకు ఇవ్వడానికి ఆసక్తి ఉంటే పేర్లు నమోదు చేసుకోవచ్చు.
చాలామంది పర్యాటకులు స్థానికంగా లభించే ఆహార పదార్థాలను రుచి చూడాలనుకుంటారు. అక్కడి మనుషులతో మాట్లాడి, సంస్కృతీ సంప్రదాయాలు, ఆహారపు అలవాట్లు, దుస్తులు, స్థానిక కళల గురించి తెలుసుకోవాలనుకుంటారు. ఇవన్నీ సాధారణ హోటళ్లలో లభించవు. గిరిజన ప్రాంతాల్లో ఈ హోమ్ స్టే బాగా ఆదరణ ఉంటుంది. దీనివల్ల స్థానికులకు కూడా ఉపాధి లభిస్తోంది. విశాఖలో విజయవంతం అయితే పలు చోట్ల ప్రభుత్వం ఈ విధానాన్ని ప్రవేశ పెట్టే అవకాశం ఉంది.