కొత్త ఏడాదిలోకి అడుగుపెడుతున్న తరుణంలో కేంద్ర ప్రభుత్వం నుంచి చాలా గుడ్ న్యూస్‌ల కోసం రియల్ ఎస్టేట్ రంగం ఎదురు చూస్తోంది. ముఖ్యంగా అఫోర్డబుల్ హౌసింగ్ నిర్వచనం మార్చాలని కోరుతోంది. 2017లో అఫోర్డబుల్ హౌసింగ్ అంటే ‘ రూ. 45 లక్షలలోపు ధర ఉన్న ఇళ్లుగా నిర్ణయించింది. ఇప్పటికీ మార్చలేదు. ఎనిమిదేళ్లలో నిర్మాణ సామాగ్రి ధరలు, భూమి విలువ , కార్మికుల వేతనాలు విపరీతంగా పెరిగాయి. ఇప్పుడు రూ. 45 లక్షల లోపు ఇళ్లు దాదాపుగా అసాధ్యంగా మారాయి. ఈ పరిమితిని ప్రస్తుత మార్కెట్ పరిస్థితులకు అనుగుణంగా రూ. 90 లక్షలకు పెంచాలని లేదా ధరతో సంబంధం లేకుండా కేవలం ఫ్లాట్ సైజు ఆధారంగానే అఫోర్డబుల్ హౌసింగ్‌ను నిర్వచించాలని రియల్ ఎస్టేట్ వర్గాలు కోరుతున్నాయి.
అలాగే సొంత ఇంటి కల సాకారం కావాలంటే గృహ రుణాల వడ్డీపై ఇచ్చే మినహాయింపును పెంచాలని మధ్యతరగతి ప్రజలు కోరుతున్నారు. ప్రస్తుతం ఆదాయపు పన్ను చట్టం సెక్షన్ 24(బి) కింద వడ్డీపై గరిష్టంగా రూ. 2 లక్షల వరకు మినహాయింపు లభిస్తోంది. క్రెడాయ్ దీనిని రూ. 5 లక్షలకు పెంచాలని ప్రతిపాదిస్తోంది. వడ్డీ మినహాయింపు పెంచడం వల్ల కొనుగోలుదారుల పన్ను భారం తగ్గి, ఇళ్లు కొనడానికి మరింత మంది ఆసక్తి చూపిస్తారని, ఇది దేశ ఆర్థిక వ్యవస్థకు జోష్ ఇస్తుందని అసోసియేషన్ విశ్లేషిస్తోంది.
ప్రస్తుతం అఫోర్డబుల్ హౌసింగ్ కేటగిరీ కింద వచ్చే ఇళ్లకు కేవలం 1 శాతం జీఎస్టీ మాత్రమే వర్తిస్తోంది. ప్రభుత్వం గనుక అఫోర్డబుల్ హౌసింగ్ పరిమితిని రూ. 90 లక్షలకు పెంచితే, మధ్యతరగతి వారికి కూడా ఈ తక్కువ జీఎస్టీ ప్రయోజనం అందుతుంది. దీనివల్ల ఫ్లాట్ల ధరలు తగ్గి సామాన్యులకు భారం తగ్గుతుంది. అంతేకాకుండా, నిర్మాణ కాంట్రాక్టులపై ఉన్న 18 శాతం జీఎస్టీని 12 శాతం కి తగ్గించాలని కూడా క్రెడాయ్ కోరుతోంది. కేవలం కొనుగోలుదారులకే కాకుండా, అఫోర్డబుల్ ప్రాజెక్టులను చేపట్టే బిల్డర్లకు కూడా పన్ను మినహాయింపులు ఇవ్వాలని క్రెడాయ్ కోరుతోంది. రియల్ ఎస్టేట్ 2026లో అద్భుతంగా ఉండాలంటే.. ఈ డిమాండ్లు పరిశీలించాలని కోరుతున్నారు. మరి కేంద్రం ఆలోచిస్తుందా?
