భారతదేశ రియల్ ఎస్టేట్ మార్కెట్లో నివాస ధరలు గత రెండేళ్లలో గణనీయమైన పెరుగుదలను నమోదు చేశాయని ANAROCK రియల్ ఎస్టేట్ కన్సల్టెన్సీ సర్వే తెలిపింది. 2023 నుంచి 2025 రెండో త్రైమాసికం వరకు సగటు నివాస ధరలు చదరపు అడుగుకు రూ. 6,001 నుంచి రూ. 8,990కు చేరాయి, అంటే 50 శాతం కంటే ఎక్కువ పెరుగుదల.
ANAROCK నివేదిక ప్రకారం భూమి ధరలు పెరగడం, నిర్మాణ ఖర్చులు పెరగడం ఇన్ఫ్రాస్ట్రక్చర్ అభివృద్ధి ప్రాజెక్ట్‌లు మెట్రో, హైవేలు వంటివి కూడా ధరల పెరుగుదలకు కారణమయ్యాయి. టాప్ 7 నగరాలు ఢిల్లీ-NCR, ముంబై, బెంగళూరు, హైదరాబాద్, చెన్నై, పూణె, కోల్‌కతా ఈ ధరల పెరుగుదలలో ముందంజలో ఉన్నాయి. 90 శాతం మంది కొనుగోలుదారులు ధరల పెరుగుదలపై ఆందోళన వ్యక్తం చేశారు. మధ్యతరగతి , అఫోర్డబుల్ హౌసింగ్ కోసం చూస్తున్న వారు ఈ ధరల ఒత్తిడిని ఎక్కువగా ఎదుర్కొంటున్నారు. “ధరలు ఇంత వేగంగా పెరుగుతుంటే, మా బడ్జెట్లో ఇల్లు కొనడం కష్టమవుతోంది,” అని పలువురు అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు.
సర్వే ప్రకారం, ఢిల్లీ-NCR, ముంబైలో ధరలు అత్యధికంగా పెరిగాయి. చదరపు అడుగుకు సగటు ధరలు రూ. 10,000-12,000కు చేరాయి. బెంగళూరు , హైదరాబాద్‌లోని లగ్జరీ సెగ్మెంట్లలో కూడా గణనీయమైన పెరుగుదల 40-45 శాతం నమోదైంది. అఫోర్డబుల్ హౌసింగ్ సెగ్మెంట్లో ధరలు స్థిరంగా ఉన్నప్పటికీ, ఈ సెగ్మెంట్లో యూనిట్ల సంఖ్య తగ్గుతోంది. డెవలపర్లు లగ్జరీ ప్రీమియం ప్రాజెక్ట్‌లపై ఎక్కువ దృష్టి పెడుతున్నారు.
నిపుణుల అభిప్రాయం ప్రకారం, 2025 చివరి నాటికి ధరలు మరింత పెరిగే అవకాశం ఉంది, కానీ మార్కెట్ ఇప్పుడు కొంత స్థిరీకరణ దశలోకి వెళ్లవచ్చునని భావిస్తున్నారు. రియల్ ఎస్టేట్ మార్కెట్ బలమైన వృద్ధిని కొనసాగిస్తున్నప్పటికీ, ధరల పెరుగుదల సామాన్య కొనుగోలుదారులకు సవాళ్లను తెచ్చిపెడుతోందని అంచనా వేస్తున్నారు.