హైదరాబాద్ రియల్ ఎస్టేట్ లో కూకట్ పల్లి కి ప్రత్యేకత ఉంది. అత్యధిక రేటు పలుకుతున్న ప్రాంతంగా నిలిచింది. ఇక్కడ హౌసింగ్ బోర్డుకు ఉన్న స్థలాలను వేలంలో అమ్ముతున్నారు. ఇటీవల చిన్న చిన్న హౌసింగ్ , కమర్షియల్ ప్లాట్లకు భారీగా స్పందన వచ్చింది. గజం మూడు లక్షల వరకూ పలికింది. ఇప్పుడు భారీ కమర్షియల్ ప్లాట్లను వేలం వేసేందుకు హౌసింగ్ బోర్డు రెడీ అయింది.
KPHB-హై-టెక్ సిటీ కారిడార్‌కు నేరుగా ఆనుకుని ఉన్న 7.3 ఎకరాల సిగ్నేచర్ ల్యాండ్ పార్సెల్‌ను వేలం వేయడానికి ఏర్పాట్లు చేసింది. ఇది ప్రైమ్ ఏరియా. కమర్షియల్ గా ఈ స్థంలో గ్రేడ్-ఎ ఆఫీస్ టవర్లు , లగ్జరీ హోటళ్ళుృ, హై-ఎండ్ రెసిడెన్షియల్ స్కైస్క్రాపర్స్ నిర్మించుకోవచ్చు. హైటెక్ సిటీ, ఫైనాన్షియల్ డిస్ట్రిక్ట్ గచ్చిబౌలికి సమీపంలోనే ఉండటంతో వీటికి భారీ డిమాండ్ ఉంటుందని భావిస్తున్నారు. ప్లాట్ 1, 4598 చదరపు గజాలు, ప్లాట్ 2 , 2420 చదరపు గజాలు వాణిజ్య ప్లాట్ 1148.30 చదరపు గజాలు వేలం వేయనున్నారు. ఈ వేలం జూలై 30న జరుగుతుంది.
అయితే ఈ వేలం సామాన్యుల కోసం కాదు. బడా వ్యాపారుల కోసమే. ఏకపక్షంగా వ్యక్తిగత ఆస్తిగా దీన్ని కొనలేరు. ఎకరం వంద కోట్లకుపైగా పలికే అవకాశాలు ఉన్నాయి. రియల్ ఎస్టేట్ స్లంప్ లో ఉందని భావిస్తున్న తరుణంలో .. రియల్ ఎస్టేట్ కంపెనీలు ఎలా స్పందిస్తాయన్నది ఆసక్తికరంగా మారింది. వచ్చే రెండేళ్లలో కూకట్ పల్లి, ఐటికారిడార్ మధ్య ఉన్న ప్రాంతం హాట్ ప్రాపర్టీగా మారడం ఖాయం. అందుకే ఊహించనంత డిమాండ్ వస్తుందని అంచనా వేస్తున్నారు.