ఆంధ్రప్రదేశ్ రాజధాని ప్రాంతం అమరావతిలో అభివృద్ధి పనులు వేగం పుంజుకోవడంతో, విజయవాడ-గుంటూరు జాతీయ రహదారి రియల్ ఎస్టేట్ హబ్‌గా మారుతోంది. 2014 తర్వాత ఉన్న ఊపు మళ్లీ ఇప్పుడు కనిపిస్తోంది . ఈ కారిడార్‌లో గత వారం రోజుల్లోనే దాదాపు 20కి పైగా కొత్త అపార్ట్మెంట్ ప్రాజెక్టులు భూమిపూజ జరుపుకున్నాయి. రాజధాని నిర్మాణ పనుల పునరుద్ధరణ , మౌలిక సదుపాయాల కల్పనపై ప్రభుత్వం ప్రత్యేక దృష్టి సారించడంతో, సొంతింటి కలను నిజం చేసుకోవాలనుకునే మధ్యతరగతి ప్రజలు, సాఫ్ట్వేర్ ఉద్యోగులు ఈ ప్రాంతం వైపు మొగ్గు చూపుతున్నారు.
ముఖ్యంగా కాజ, మంగళగిరి, పెదకాకాని పరిసరాల్లో ఆకాశహర్మ్యాల నిర్మాణం జోరందుకుంది. ఇక్కడ కేవలం సాధారణ అపార్ట్మెంట్లే కాకుండా, అత్యాధునిక సౌకర్యాలతో కూడిన గేటెడ్ కమ్యూనిటీ ఫ్లాట్లకు డిమాండ్ విపరీతంగా పెరిగింది. హైవేకు ఇరువైపులా సర్వీస్ రోడ్ల విస్తరణ , మౌలిక సదుపాయాల ప్రాజెక్టుల లేగం ఈ ప్రాంత ప్రాముఖ్యతను మరింత పెంచాయి. దీంతో ఏడాది కాలంగా స్తబ్దుగా ఉన్న మార్కెట్ ఒక్కసారిగా పుంజుకుని, కొనుగోలుదారుల సందడితో కళకళలాడుతోంది.
నివాస ప్రాంతాలతో పాటు కమర్షియల్ స్పేస్‌కు కూడా ఇక్కడ భారీగా గిరాకీ ఏర్పడింది. ప్రధాన బ్రాండెడ్ షోరూమ్‌లు, మల్టీప్లెక్స్‌లు , కార్పొరేట్ హాస్పిటల్స్ ఈ హైవే వెంట తమ కార్యకలాపాలను ప్రారంభించేందుకు ఆసక్తి చూపుతున్నాయి. భూముల ధరలు ఆకాశాన్ని తాకుతున్నప్పటికీ, భవిష్యత్తులో ఈ ప్రాంతం ఒక భారీ ‘మెట్రో సిటీ’గా అవతరిస్తుందన్న నమ్మకంతో ఇన్వెస్టర్లు పోటీ పడి పెట్టుబడులు పెడుతున్నారు.
