ఫోకస్ : ఉగ్రవాదానికి విరుగుడు మహోగ్ర పోరాటాలేనా ?

ఫోకస్

పారిస్ లో నరమేథం, అంతకుముందు ముంబయి పై ఉగ్రమూకల దాడి, ఇలాఅనేక ప్రపంచదేశాల్లో ఉగ్రవాదమూకలు విరుచుకుపడుతూనే ఉన్నాయి. పెద్ద సంఘటన జరిగినప్పుడల్లా ఉలికిపాటు ఎక్కువ అవుతూనేఉంది. పునరావృతంకాకుండా ఉండాలంటే ప్రపంచదేశాలు కలిసికట్టుగా ఏం చేయాలన్న ప్రశ్న తలెత్తూనేఉంది. ప్రధాని నరేంద్రమోదీ సందర్భం వచ్చినప్పుడల్లా ప్రపంచం ముందు ప్రస్తుతం రెండు ప్రధాన సవాళ్లున్నాయనీ, వాటిలో ఒకటి ఉగ్రవాదమైతే రెండవది గ్లోబల్ వార్మింగ్ వల్ల ఎదురయ్యే ముప్పు అని చెబుతూనే ఉన్నారు. ఉగ్రవాదులు పెనుదాడులకు పాల్పడినప్పుడల్లా, ఆ మూకలను సమూలంగా నాశనం చేయాలన్నంత కసి బయటపడుతూనేఉంది. అభివృద్ధిచెందిన దేశాలైతే వెంటనే మహోగ్రపోరాటానికి పాల్పడుతున్నాయి. ట్విన్ టవర్స్ పై దాడి తర్వాత అమెరికా, ఇప్పుడు ఫ్రాన్స్ చేస్తున్నది అదే. అయితే మహోగ్రపోరాటాలతో ఉగ్రవాదులనూ, వారి స్థావరాలనూ నాశనం చేసినంతమాత్రాన ఉగ్రవాద భావజాలం తుడిచిపెట్టుకుని పోతుందా? ఈ ప్రశ్నకు సరైన సమాధానం రాబట్టకుండానే ప్రతికారచర్యలు చేపట్టడంవల్ల పెద్దగా ఒరిగేది ఏమీ ఉండదు. అందుకే ఈ సందర్భంగా, టెర్రరిజానికి విరుగుడు ఏమిటన్నది నిశితంగా ఆలోచించాలి.

పారిస్ లో ఉగ్రవాదులు విచక్షణారహితంగా కాల్పులు జరపడంతో 130మంది మృత్యుపాలయ్యారు. దీంతో ప్రపంచ వ్యాప్తంగా ఉగ్రవాదంపై చర్చ జరుగుతోంది. పారిస్ దాడులకు ఐఎస్ఐఎస్ బాధ్యత తీసుకోవడంతో ఇస్లాం మతాన్నే తప్పుపట్టే రీతిలో కొంతమంది అడ్డంగా వాదిస్తున్నారు. ఇస్లాంమతంలోనే ఉన్మాదముందన్న దాకా ఈవాదన పైకెగిసింది. ఇస్లాం మతం అధికారికంగా ఉన్న దేశాలు- తమ మతం ఏనాడూ ఉగ్రవాద, తీవ్రవాద దోరణులను ప్రోత్సహించలేదని ఘాటుగా బదులిస్తున్నాయి. పైగా, ఇస్లాం మతదేశాల్లో సైతం ఉగ్రవాదుల దాడులు జరుగుతూనే ఉండటాన్ని గమనించాలని ఆయాదేశాలు అంటున్నాయి. పొరుగునఉన్న పాకిస్తాన్ సైతం టెర్రరిస్ట్ దాడులతో అతలాకుతలమవుతూనే ఉన్న సంగతి తెలిసిందే.

ఎవరిది ఉగ్రవాదం ?

ఉగ్రవాదం లేదా తీవ్రవాదమన్నది కేవలం లక్షిత భావజాలం. దీన్ని ఏ ఒక్క మతంతోకానీ దేశంతోకానీ ముడిపెట్టడానికి వీలులేదు. అలాగే, ఏదో ఒక్క కాలానికి సంబంధించినది అంతకంటేకానేకాదు. ఇస్లాంమతోన్మాదులవల్లనే ఉగ్రవాద దాడులు ఇండియాలో జరుగుతున్నాయని ఎవరైనా గిరిగీసినట్లు చెబితే, అది తప్పేఅవుతుంది. ఇస్లాం మత వాసనలు దేశంలో లేనిరోజుల్లో సైతం ఉగ్రవాద జాడలున్నాయి. విదేశీ మతం (పరమతం) చొచ్చుకురాకపోయినా ఆయా మతోన్మాద చేష్టలు జ్వలించకపోయినా, ఉగ్రవాదదాడులు సాగాయి. హిందూమతంలోని శాఖలమధ్య వైరంతో చెలరేగిన ఉగ్రదాడులు శాంతికి విఘాతం కలిగించాయి. శైవ,వైష్ణవ మతపరమైన ఉగ్రవాద ఘటనలు ఎన్నో జరిగాయి. శివాలయాలు కూలిపోయాయి. వైష్ణవాలయాలు నాశనం అయిపోయాయి. రక్తపుటేర్లు ప్రవహించాయి.
హిందూదేశ చరిత్ర, పురాణాలు చదువుతుంటే ఉగ్రవాదమన్నది మానవ అభ్యుదయ నాగరికతకు ఎప్పుడూ విఘాతం కలిగిస్తూనే ఉంది. మానవత్వానికీ, మూర్ఖత్వానికీ మధ్య వైరం ఉంటూనేఉంది. అయితే ఏది మానవత్వం, ఏది మూర్ఖపు ఆలోచనలన్నదానికి ఎప్పటికప్పుడు కాలమే నిర్ణేత. దేవదానవుల మధ్య మహాయుద్ధాలు జరిగినట్లు పురాణాలు చెబుతున్నాయి. దానవులు (అసురులు) దొంగచాటుగా దాడులకు దిగినట్లు చెబుతుంటారు. మహానగరాలను భస్మీపటలం చేయడం, వేలాదిమంది ఊచకోతకోయడం ఆనాడూ జరిగింది. సంస్కృతి, మానవ వికాసం, నాగరిక ధోరణి ఒక వర్గంవాళ్లని సన్మార్గంలో నడిపిస్తే, తొందరపాటు నిర్ణయాలు, ప్రతీకారవాంఛ, కట్టలుతెంచుకునే ఆవేశం, అమానుషత్వం మరొక వర్గంవారిని ముష్కరమూకలుగా మార్చేసింది. ఎప్పటికప్పుడు ఈ లక్షణాలు అటునుంచి ఇటు, ఇటునుంచి అటూ ప్రవహిస్తూనే ఉంటాయి. తప్పొప్పులు సందర్భోచితంగా మారుతుండేవి. దీంతో దానవులనుకున్న వాళ్లు దేవతలుగా (మంచివారిగా)మారవచ్చు, లేదా సద్భుద్ది వక్రీకరించి దేవతలు దానవులుగా మారనూవచ్చు. అంటే, దేవతలు, దానవులన్నవి వారివారి భావజాలానికి సంబంధించిన గుర్తింపులేకానీ అందరూ ఒక్కటే. ఒక తల్లికడుపున పుట్టినవారిలో భావజాల అంతరాలనుబట్టి విభిన్నమార్గాల్లో ప్రయాణంసాగిస్తుంటారు. మతోన్మాద భావజాలం ఎవరు ప్రదర్శించినా అది తప్పే అవుతుంది. మతం చెప్పని సిద్ధాంతాలను, స్వేచ్ఛను తమకుతామే నిర్ధారించుకుని వాటికోసం కడవరకూ పోరాడుతుంటారు. తమ వికృతచేష్టలకు మతం రంగు పులుముతుంటారు.

భయం వల్ల కలిగే ఇబ్బందులు

భయం ఎంతపనైనా చేయిస్తుంది. మానవతావాదాన్ని ముక్కచెక్కలుచేస్తుంది. మతసామరస్యాన్ని చిన్నాభిన్నం చేస్తుంది. స్వార్థపూరిత ఆలోచనలను పెంచుతోంది. మిత్రులమధ్య శత్రుత్వం పెంచుతుంది. దేశాలమధ్య అశాంతిని రెచ్చగొడుతుంది. యావత్ ప్రపంచాన్ని శాసిస్తుంది.

సిరియా నుంచి కొంతమంది శరణార్థులుగా ఫ్రాన్స్ లోకి ప్రవేశించారని, అలాంటి వారే ఉగ్రవాదచర్యలకు పాల్పడ్డారన్న ఆధారాలు కనిపిస్తున్న నేపథ్యంలో అమెరికాలోని ఐదు రాష్ట్రాల గవర్నర్లు సిరియా నుంచివచ్చే శరణార్థులను లోపలకు రానియ్యకూడదంటూ తేల్చిచెప్పారు. అయితే, ఒబామా ఇప్పటికే తీసుకున్న నిర్ణయానికి ఇది వ్యతిరేకమైనది. ఏ దేశం నుంచైనా శరణార్థులుగా వచ్చే వారి విషయంలో అమెరికా ఓ పద్ధతి పెట్టుకుంది. ఏడాదికి 15వేల చొప్పున శరణార్థులకు ఆశ్రయం కల్పించాల్సిఉంది. ఇది మానవతా దృక్ఫథంతో సాగే ప్రక్రియ. అయితే ఇప్పుడు సంయుక్త రాష్ట్రాల్లోని ఐదురాష్ట్రాలు శరణార్థులను రానీయకూడదనీ, అలాంటివారివల్లనే ఉగ్రవాద ముప్పు పొంచిఉంటుందని చెప్పడం పిరికిపందల చేష్టలని ఛారిటబుల్ వర్గాలు అంటున్నాయి. భయపడటం కంటే శరణార్థులను మానవతావాదంతో అక్కున చేర్చుకోవడం సరైనదన్న వాదన వీరిది.

శరణుకోరినప్పుడు ఆశ్రయం ఇవ్వడమన్నది మానవతావాదానికి సంబంధించిన విషయం అయితే, ఎప్పుడైతే భయం తొలిచేస్తుందో అప్పుడు మానవతావాదం కూడా ఛిద్రమవుతూనేఉంది. ఒక్కోసారి శరణార్థులకు ఆశ్రయం కల్పించిన తర్వాత వచ్చే చిక్కులను సమర్థవంతంగా ఎదుర్కోలేక దేశాలకుదేశాలే ఇబ్బందిపడిన సందర్భాలున్నాయి. మరికొన్ని సందర్భాల్లో శరణార్థుల వలసల కారణంగా రెండు దేశాలమధ్య యుద్ధాలు రావచ్చు. మిత్రులు శత్రువులుగా మారవచ్చు.

యుద్ధంతో సమస్య తొలిగిపోతుందా?

పారిస్ పై ఉగ్రవాదుల దాడికి ప్రతీకారంగా సిరియాలోని ఇస్లామిక్ స్టేట్ ఉగ్రవాద స్థావరాలపై ఫ్రాన్స్ వైమానిక దాడులు నిర్వహిస్తోంది. ఉగ్రవాద వ్యతిరేక పోరాటనికి అంతా కలసిరావాలని ఫ్రాన్స్ పిలుపునిచ్చింది. గతంలో అమెరికా కూడా ట్విన్ టవర్స్ పై దాడికి ప్రతిదాడిని భారీఎత్తునే నిర్వహించింది. ఒసామా బిన్ లాడిన్ ని చంపి ప్రతీకారం తీర్చుకున్నట్లు ప్రకటించుకుంది. అయితే, మహాపోరాటల వల్ల సమస్య పూర్తిగా తొలిగిపోయిందా? అంటే లేదనే సమాధానం వస్తున్నది. పైగా పారిస్ దాడుల తర్వాత ఐఎస్ఐఎస్ తాము వాషింగ్టన్ ను టార్గెట్ చేసుకోబోతున్నామని బాహటంగానే ప్రకటించింది. అణచివేత, మహాపోరాటాలవల్ల సమస్య తొలగకపోయినా ఇది ఆయా భాదిత దేశాల ఆత్మగౌరవానికి సంబంధించిన విషయంగా మారడంతో ఉగ్రవాద పీడిత దేశాలు ప్రతీకారం తీర్చుకోక తప్పడంలేదు. దీంతో మరోపక్క స్వాతంత్ర్య భావజాలం, మతపరమైన భావజాలం, మూర్ఖత్వం వెరసి ఉగ్రవాదం కొత్తరూపు దిద్దుకుంటున్నది. దీన్ని అంతమొందించడానికి కేవలం యుద్ధమే పరిష్కారమని ఎవ్వరూనమ్మడంలేదు. ఉగ్రవాద స్థావరాలను నామరూపాలు లేకుండా చేసినా అది భావజాలాన్ని అంతమొందించినట్లు కానేకాదు. దీంతో ఇలాంటి ప్రతీకారదాడులు తాత్కాలిక ఉపశమనం ఇస్తాయేతప్ప శాశ్వత పరిష్కారం చూపడంలేదన్నది చరిత్ర చెప్పిన సత్యం. చేసేది, చేయించేది ఎవరైనా ఒక నరమేథం తర్వాత మరొకటి జరిగిపోతూనే ఉన్నాయి. అందుకు కారణాలు మారుతున్నాయి. అంతే తేడా.

– కణ్వస

Telugu360 is always open for the best and bright journalists. If you are interested in full-time or freelance, email us at Krishna@telugu360.com.

Most Popular

జనసైనికుల్ని రెచ్చగొట్టేందుకు వైసీపీ దింపుడు కళ్లెం ఆశలు !

ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో కీలక పరిణామం పూర్తయింది. టీడీపీ, జనసేన మధ్య సీట్ల సర్దుబాటు పూర్తయింది. ఏ సీట్లలో పోటీ చేయాలో కూడా ఓ నిర్ణయానికి వచ్చారు. అయితే పవన్ 24 సీట్లే తీసుకున్నారంటూ.....

విచారణకు రాను – సీబీఐకి కవిత లేఖ

ఢిల్లీ లిక్కర్ స్కాంలో విచారణకు తాను హాజరు కావడం లేదని సీబీఐకి ఎమ్మెల్సీ కవిత లేఖ రాశారు. సీఆర్పీసీ సెక్షన్ 41ఏ కింద జారీ చేసిన నోటీసులను రద్దు చేయండి...

మళ్లీ ఉద్యోగుల పోరాటం ప్రభుత్వానికి తాకట్టు !

ఎన్నికలకు ముందు ఉద్యోగ నేతలు ఆందోళనలు అంటూ హడావుడి చేశారు. కానీ అదంతా స్క్రిప్టెడ్ అని.. ఏమీ చేయకపోయినా ఏదో ఇచ్చినట్లుగా హడావుడి చేయడానికని మొదటి నుంచి అనుమానాలుననాయి. ఇప్పుడు అదే నిజం...

అభిప్రాయం : జనసేన శ్రేణుల అంతర్మధనం

2024 ఎన్నికల రాజకీయ వేడి రాజకుంది. తెలుగు దేశం పార్టీజనసేన కలిసి ఏర్పాటు చేసుకున్న పొత్తు లో భాగం గా జనసేన 24 ఎమ్మెల్యే సీట్ల లో పోటీ చేస్తుందని చంద్రబాబు -పవన్...

HOT NEWS

css.php
[X] Close
[X] Close