జూబ్లిహిల్స్ ఉపఎన్నికలు జరిగాయి. కేటీఆర్ టీడీపీ సానుభూతిపరుల్ని ఆకట్టుకోవడానికి నానా తంటాలు పడ్డారు. కానీ వైసీపీ సానుభూతిపరుల గురించి అసలు పట్టించుకోలేదు. ఎందుకంటే అలాంటి వారు ఉన్నారని ఆయన కూడా అనుకోవడం లేదు. అలాంటప్పుడు టీడీపీకి వ్యతిరేకంగా ఉండే జగన్ తో బీఆర్ఎస్ దగ్గరి సంబంధాలు పెట్టుకోవడం వల్ల ఉపయోగం ఏమి ఉంటుంది..? ఇంకా నష్టం జరుగుతుంది. అయినా బీఆర్ఎస్ పార్టీ జగన్ కు మద్దతు ఇస్తూ.. టీడీపీని కించ పరుస్తూ రాజకీయాలు చేస్తోంది.
టీడీపీని రెచ్చగొట్టిన బీఆర్ఎస్ సోషల్ మీడియా
జూబ్లిహిల్స్ ఉపఎన్నికల సమయంలో టీడీపీ సానుభూతిపరుల ఓట్ల కోసం బీఆర్ఎస్ గట్టిగా ప్రయత్నించింది. కేటీఆర్ వివిధ మీడియాలకు ఇచ్చిన ఇంటర్యూల్లోనే ఇది స్పష్టమయింది. అయితే కేటీఆర్ ఆలోచనల్ని అర్థం చేసుకోని బీఆర్ఎస్ క్యాడర్ టీడీపీ నేతలపై అనుచిత వ్యాఖ్యలను చేస్తూ రెచ్చగొట్టింది. ఫలితంగా టీడీపీ సోషల్ మీడియా పోలింగ్ కు ఐదు రోజుల ముందు యాక్టివ్ అయి బీఆర్ఎస్ కు వ్యతిరేకంగా గట్టి ప్రచారం చేసింది. గతంలో ఎన్టీఆర్ ను.. ఇతరులని .. టీడీపీ పార్టీని ఉద్దేశించి చేసిన వ్యాఖ్యలను వైరల్ చేశాయి. సీఎం రమేష్ బయటపెట్టిన విషయాలను ట్రెండింగ్ లోకి తీసుకు వచ్చి బీఆర్ఎస్కు టీడీపీ సానుభూతిపరుల ఓట్లు పడకుండా చేయగలిగారు. అంటే కేటీఆర్ శ్రమ అంతా బూడిదలో పోసిన పన్నీరే.
రేవంత్ పై టీడీపీ కేడర్ కు సానుభూతి.. రెచ్చగొట్టి ఇంకా బలోపేతం చేస్తున్న బీఆర్ఎస్
రేవంత్ రెడ్డి టీడీపీ నుంచి వచ్చారు. అంత మాత్రాన టీడీపీ క్యాడర్ ఆయనకు సపోర్టు చేయదు. ఆయనపై ప్రత్యేక అభిమానం ఎందుకు చూపుతున్నారో బీఆర్ఎస్ పార్టీ కాస్త స్టడీ చేస్తే.. ఓ పాయింట్ వారికి క్లారిటీగా తెలుస్తుంది. రేవంత్ ఎప్పుడూ టీడీపీని కించపర్చరు. చంద్రబాబును కించ పర్చరు. అనవసర విమర్శలు చేయరు. ఎందుకంటే దాని వల్ల ఆయనకు ఎలాంటి ఉపయోగం ఉండదు. అలా చేయకపోవడం వల్ల టీడీపీ క్యాడర్ లో తనపై ఉన్న అభిమానం నిలబడుతుంది. అదే సమయంలో.. బీఆర్ఎస్ పార్టీ అదే పనిగా టీడీపీని టార్గెట్ చేసి.. వారికి సరైన మొగుడు రేవంతే.. ఆయనకు మద్దతివ్వాల్సిందే అన్న పరిస్థితిని కల్పిస్తున్నారు. అదే రేవంత్ వ్యూహం పాటిస్తే.. సగం మంది అయినా స్ప్లిట్ అయ్యే అవకాశం ఉండేది. కానీ జగన్ కోసం టీడీపీపై తాము చూపుతున్న వ్యతిరేకత వల్ల.. మొత్తానికే నష్టపోతున్నారు.
జగన్ తో కటీఫ్ చెప్పకపోతే మొదటికే నష్టం
జగన్ రెడ్డి వల్ల బీఆర్ఎస్ కు ఎలాంటి మేలు జరగదు. తెలంగాణలో ఒక్క ఓటు రాదు. జాతీయ స్థాయిలో ఆయన బీఆర్ఎస్ కు మద్దతుగా ఉండరు . జగన్ రెడ్డి అవసరాలు జగన్ రెడ్డివి. కాదని ఎవరూ అనలేరు. రేపు రాహుల్ గెలిచేలా ఉంటే ఆయన నిర్మోహమాటంగా ఆయన వెనుక వెళ్లిపోతారు. కేసీఆర్ తో పాటు ఉంటారనుకోవడం అత్యాశే. వైసీపీకి వచ్చే ఎంపీ సీట్లు.. బీఆర్ఎస్ సీట్లు కలిపి చక్రం తిప్పాలని కేసీఆర్ అనుకున్నారు కానీ ఆ కల చెదిరిపోయింది. జగన్ తో టచ్ లో ఉంటే ఎప్పటికీ అలాంటి అవకాశం రాదు. తమకు తెలంగాణలో డ్యామేజ్ అవుతుంది. ఇలాంటి పొలిటికల్ ఈక్వెషన్స్ అంచనా వేయనంత కాలం. .బీఆర్ఎస్ ముందడుగు వేయడం కష్టమవుతుంది.
