రియల్ ఎస్టేట్ మోసాలు పెరిగిపోతున్న రోజులు ఇవి. నమ్మకమైన మాటలు చెప్పి రంగు రంగుల కలలు చూపించి మోసపూరిత ఇళ్లు, స్థలాలు అంటగట్టేస్తున్నారు. కొన్న తర్వాత చుక్కలు చూపిస్తున్నారు. ఇలాంటి వారి సమస్యల పరిష్కారానికి రెరా ఉంది. అయితే చాలా మందికి రెరాను ఎలా సంప్రదించాలో తెలియదు.
రియల్ ఎస్టేట్ మోసాలపై చర్యలు తీసుకోవడానికి రియల్ ఎస్టేట్ రెగ్యులేషన్ అండ్ డెవలప్మెంట్) యాక్ట్ (RERA) ఒక బలమైన ఆయుధం. RERAలో ఫిర్యాదు చేసే విధానం ఆన్లైన్ లోకి కూడా అందుబాటులోకి వచ్చింది. ఇంటి కొనుగోలుదారులు ప్రాజెక్ట్ ఆలస్యం, మోసపూరిత ప్రకటనలు, నాణ్యతా సమస్యలు వంటి ఫిర్యాదులను దాఖలు చేయవచ్చు.
RERA) ద్వారా ఫిర్యాదులు ఆన్‌లైన్‌గా లేదా ఆఫ్‌లైన్‌గా దాఖలు చేయవచ్చు. అధికారిక వెబ్సైట్ https://rera.telangana.gov.in/ ద్వారా సులభంగా ఫిర్యాదు చేయవచ్చు. 8 నుంచి 12 వారాల్లో సమస్యను పరిష్కరించడం రెరా విధి. ఫిర్యాదుకోసం రెరా వెబ్ సైట్ లో అకౌంట్ క్రియేట్ చేసుకుని ఆన్లైన్ ఫారమ్‌లో వివరాలు ఎంటర్ చేసి, డాక్యుమెంట్లు అప్లోడ్ చేయాలి. . సబ్మిట్ చేసిన తర్వాత రెఫరెన్స్ నంబర్ ఇస్తారు. ఫిర్యాదు స్టేటస్‌ను వెబ్సైట్లో ట్రాక్ చేసుకోవచ్చు.
ఆఫ్‌లైన్ ఫిర్యాదు అయితే Form Mను డౌన్లోడ్ చేసి, వివరాలు నింపి rera-maud@telangana.gov.inకు ఈమెయిల్ చేయవచ్చు. లేదా రెరా ఆఫీసులో ఇవ్వొచ్చు. అయితే బిల్డర్లపై చర్యలు తీసుకునే అధికారం రెరాకు తమ వద్ద రిజిస్టర్ అయిన ప్రాజెక్టుల విషయంలోనే ఉంటుంది. అందుకే ఫిర్యాదు దాఖలు చేసే ముందు ప్రాజెక్ట్ RERA రిజిస్టర్డ్ అని చెక్ చేయండి. మోసాలపై జరిమానాలు, పరిహారం పొందే అవకాశం ఉంది. ఇలాంటి సమస్యలు ఎదుర్కొంటున్నవారు త్వరగా చర్యలు తీసుకోవాలని నిపుణులు సూచిస్తున్నారు.