వైసీపీ ఎంపీ మిథున్ రెడ్డి ఏం చేస్తారు?. బయట ఏం చేస్తారో తెలియదు కానీ రికార్డుల్లో ముఖ్యంగా ఎన్నికల సంఘానికి సమర్పించిన రికార్డుల్లో వ్యవసాయం మాత్రమే చేస్తారు. కానీ ఆయన ఆస్తులు మాత్రం ఊహించనంతగా పెరిగిపోతున్నాయి. రాజకీయాల్లో ప్రజాప్రతినిధుల ఆస్తుల పెరుగుదల ఎప్పుడూ చర్చనీయాంశమే. తాజాగా రాజంపేట ఎంపీ మిథున్ రెడ్డి ఎన్నికల సంఘానికి సమర్పించిన ఆస్తుల వివరాలు విశ్లేషిస్తే, గత పదేళ్లలో ఆయన ఆర్థిక స్థితిగతులు శరవేగంగా మారినట్లు స్పష్టమవుతోంది. 2014లో తొలిసారి పార్లమెంటుకు పోటీ చేసిన సమయంలో కేవలం రూ. 22.59 కోట్లుగా ఉన్న ఆయన మొత్తం ఆస్తుల విలువ, 2024 ఎన్నికల నాటికి ఏకంగా రూ. 146.85 కోట్లకు చేరింది. అంటే పదేళ్ల కాలంలో ఆయన సంపదలో దాదాపు రూ. 124.25 కోట్ల భారీ వృద్ధి నమోదైంది.
గణాంకాలను పరిశీలిస్తే, 2014 నుండి 2019 మధ్య ఐదేళ్లలో ఆయన ఆస్తులు రూ. 44 కోట్లు పెరగగా, 2019 నుండి 2024 మధ్య కాలంలో అంటే వైసీపీ అధికారంలో ఉన్న సమయంలో ఏకంగా రూ. 80 కోట్లకు పైగా సంపద పెరగడం విశేషం. 2024 అఫిడవిట్ ప్రకారం ఆయనకు రూ. 47.54 కోట్ల చరాస్తులు, రూ. 99.30 కోట్ల స్థిరాస్తులు ఉన్నాయి. అదే సమయంలో ఆయనపై రూ. 56.09 కోట్ల మేర అప్పులు కూడా ఉన్నట్లు వెల్లడించారు.
మిథున్ రెడ్డి తన వృత్తిని వ్యవసాయదారుడిగా పేర్కొనగా, ఆయన భార్య వ్యాపారవేత్తగా కొనసాగుతున్నారు. పీఎల్ఆర్ ప్రాజెక్ట్స్, సెస్నా గార్డెన్ డెవలపర్స్ వంటి సంస్థల్లో పెట్టుబడులు, స్థిరాస్తుల విలువ పెరగడం ఈ భారీ వృద్ధికి ప్రధాన కారణాలని విశ్లేషకులు భావిస్తున్నారు. ఏది ఏమైనా, సామాన్యుల ఆదాయం ఆశించిన స్థాయిలో పెరగని కాలంలో, ప్రజాప్రతినిధుల సంపద ఇలా ఆకాశాన్ని తాకడం ఎప్పుడూ హాట్ టాపిక్కే
