ఆంధ్రప్రదేశ్ కు ఉన్న ప్లస్ పాయింట్లను మార్కెటింగ్ చేసి పెద్ద ఎత్తున పారిశ్రామికవేత్తలను ఏపీకి తీసుకురావడం ఇక అసాధ్యమైన విషయం అని గత ఏడాది జూన్ వరకూ అనుకున్నారు. ఎందుకంటే అధికారంలో రాగానే జగన్ తాను కూర్చున్న కొమ్మను నరుక్కొన్నట్లుగా.. ప్రజావేదికను కూల్చివేయించారు. అదే వేదికలో కూర్చుని ప్రకటించిన మొదలు.. ఐదు సంవత్సరాల పాటు రాష్ట్రం మొత్తం అదే జరిగింది. బయట వాళ్ల సంగతి దేముడెరుగు.. అమరరాజా లాంటి బ్రాండ్ ఏపీ సంస్థల్నీ ఇతర ప్రాంతాలకు తరలిపోయేలా చేశారు. ఇక బయట వారు ఎలా వస్తారు?.
ఏపీలో నమ్మకాన్ని పెంచడంలో చంద్రబాబు కీలక పాత్ర
కానీ కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత ఆ భూతం మళ్లీ రాదన్న నమ్మకాన్ని పెంచి పెద్ద ఎత్తున పెట్టుడులను ఆహ్వానించడానికి చేసిన ప్రయత్నాలు విజయవంతం అవుతున్నాయి. పెట్టుబడిదారులు విశ్వాసం పెంచుకుంటున్నారు. కేంద్ర ప్రభుత్వం మద్దతు కూడా ఉండటంతో మరింత సులువుగా భారీ పెట్టుబడులు వస్తున్నాయి. లక్షన్నర కోట్లతో గూగుల్ఏఐ హబ్, మరో లక్ష కోట్లతో ఆర్సెలార్ మిట్టల్ స్టీల్ ప్లాంట్ నిర్మాణం కానుండటంతో తిరుగులేని పెట్టుబడులు. వీటికి కేంద్రం మద్దతు ఉంది. ఇక టీసీఎస్, యాక్సెంచర్ లాంటి సంస్థలు క్యాంపస్లు ఏర్పాటు చేస్తున్నాయి. విభిన్నరంగాల్లో పెట్టుబడుల కోసం ప్రపంచ దిగ్గజాలు ఆసక్తి చూపిస్తున్నాయి.
సీఐఐ సహకారంతో సమ్మిట్
కాన్ఫెడరేషన్ ఆఫ్ ఇండియన్ ఇండస్ట్రీస్.. సీఐఐతో చంద్రబాబుకు మంచి సంబంధాలు ఉన్నాయి. ఇన్వెస్టర్ ఫ్రెండ్లీగా కాన్సెప్టులతో ఆయన పారిశ్రామికవేత్తలను ఆకట్టుకుంటారు. అందుకే ఏపీ కోసం సీఐఐ గట్టిగా పని చేస్తోంది. విశాఖలో పది రోజుల్లో జరగనున్న ఇన్వెస్ట్ మెంట్ సమ్మిట్ సీఐఐ ఆధ్వర్యంలో జరగబోతోంది. ఈ సమ్మిట్ కు రావాలని ఏపీలో ఉన్న అవకాశాల్ని ఎక్స్ ప్లోర్ చేయాలని ప్రపంచవ్యాప్తంగా చంద్రబాబు, లోకేష్ పిలుపులు ఇచ్చారు. ఇప్పటి వరకూ మూడు వందల మందికిపైగా పారిశ్రామికవేత్తలు వస్తామని సమాచారం పంపారని నారా లోకేష్ ప్రకటించారు. దాదాపుగా పది లక్షలకోట్ల పెట్టుబడులకు ఒప్పందాలు కుదరనున్నాయి.
ఒప్పందాలన్నీ ఆరు నెలల్లో గ్రౌండ్ అయ్యేలా కార్యాచరణ
ఈ సారి కేవలం ఎంవోయూలకే కాదు.. నేరుగా ఎగ్జిక్యూట్ చేసేలా ఒప్పందాలు చేసుకోనున్నారు. ఈ సమ్మిట్ లో చేసుకునే ఒప్పందాలు వీలైనంత త్వరగా గ్రౌండ్ అయ్యేలా నారా లోకేష్ ప్రత్యేకమైన జాగ్రత్తలు తీసుకోనున్నారు. ఓ టీమ్ ను ఫాలో అప్ కోసం ఏర్పాటు పెట్టుబడులు పెట్టాలనుకుంటున్న వారికి ప్రభుత్వం తరపున ఏదైనా సాయం అవసరం అయితే చేయనున్నారు. ప్రస్తుతం ఏపీకి అన్నీ ప్లస్ పాయింట్లే కనిపిస్తున్నాయి. పెట్టుబడుల డ్రీమ్ రన్ నడుస్తోంది.
