ఏపీ లిక్కర్ స్కాంలో హైదరాబాద్లోని కొంత మంది హవాలా ఆపరేటర్లు కీలక పాత్ర పోషించారు. లంచాలివ్వడానికి డిస్టిలరీ కంపెనీలకు నగదును సమకూర్చినట్లుగా ఆరోపణలు ఉన్నాయి. సునీల్ అహూజా అనే పేరు మోసిన హవాలా ఆపరేటర్ ప్రమేయాన్ని పోలీసులు గుర్తించి అదుపులోకి తీసుకునేందుకు ప్రయత్నించారు. కానీ కొద్ది రోజుల కిందట భారతి బిల్డర్స్ అనే రియల్ ఎస్టేట్ కంపెనీని మోసం చేసినట్లుగా కేసు నమోదు కావడంతో ఆహుజా పరారయ్యారు. ఆయనతో పాటు వ్యాపార లావాదేవీలు నిర్వహించేవారంతా కనిపించడం లేదు.
వీరు నగదు రూపంలో లావాదేవీలు నిర్వహించడంలో దిట్ట. కమిషన్ తీసుకుని డబ్బులు ప్రపంచంలో ఎక్కడికైనా తరలించగలరని.. ఇక్కడ రూపాయలు తీసుకుని ఇతర దేశాల్లో డాలర్లలో ఇప్పించగలరని చెబుతున్నారు. ఎన్నికల సమయంలో రాజకీయ నేతలు వీరి వద్దనే పెద్ద ఎత్తున నగదు తీసుకుంటారన్న అనుమానాలు ఉన్నాయి. లిక్కర్ స్కామ్లో తీగ లాగుతూంటే.. మొత్తం బయటకు వస్తున్నాయి. అలా ఈ హవాలా ఆపరేటర్ల గురించి కూడా బయటకు వచ్చింది.
లిక్కర్ స్కామ్లో నగదు రూపంలోనే అంతా చెలామణి జరిగింది. అందుకే లిక్కర్ స్కామ్ లో వీరే పెద్ద మొత్తంలో నగదును డీల్ చేసినట్లుగా అనుమానిస్తున్నారు. అహుజాలు ఏపీ సిట్ అధికారులకు దొరికితే సంచలనాత్మకమైన విషయాలు వెలుగులోకి వస్తాయి. ఒక్క లిక్కర్ స్కామ్ కాకుండా.. మొత్తం ఎవరు హవాలా లావాదేవీలు నిర్వహించారో అందరి వివరాలు వెలుగులోకి వచ్చే అవకాశం ఉంది.