నువ్వు బాగుంటావు.. నీ అందానికి నీ ముక్కు ప్రత్యక్ష ఆకర్షణ అంటూ భార్యలను పొగిడే భర్తలు ఉంటారు. ఒక్కోసారి ప్రేమతో , గారాబంతో అందమైన నీ ముక్కు కోసుకుతింటా అని సరదాగా ఆటపట్టిస్తుంటారు. కానీ, చెప్పినట్లుగానే ఓ భర్త తన భార్య ముక్కును కొరుక్కు తిన్న ఘటన అందర్నీ విస్తుపోయేలా చేస్తోంది.
పశ్చిమ బెంగాల్ శాంతిపూర్ పోలీసు స్టేషన్ పరిధిలోని బెర్పారా ప్రాంతంలో బాపన్ షేక్ – మధు ఖాతూన్ అనే అందమైన జంట నివాసం ఉంటోంది. తన భార్య అందాన్ని బాపన్ షేక్ తరుచు పొగుడుతుండేవాడు. నీ ముక్కు చాలా అందంగా ఉంటుంది..దాన్ని కొరుక్కు తింటా అంటూ అనేవారు. ఏదో ప్రేమతో సరదాకి అలా అంటున్నాడని భార్య భావించేది. కానీ, అతను అన్నంతపని చేశాడు.
ఇటీవల తెల్లవారుజామున మూడు గంటల సమయంలో బాపన్ షేక్ ఇంట్లో ఒక్కసారిగా ఆలజడి నెలకొంది. షేక్ భార్య అరుపులు, కేకలతో ఆ ప్రాంతం మార్మోగింది. ఎప్పుడు సైలెంట్ గా ఉండే ఆ ఇంటి నుంచి అరుపులు, కేకలు రావడం విన్న స్థానికులు బాపన్ షేక్ ఇంటికి వచ్చి చూసి ఒక్కసారిగా షాక్ అయ్యారు.
మధు ముక్కు నుంచి తీవ్రమైన రక్తస్రావం జరగడం చూసి అంతా ఖంగుతిన్నారు. ఏమైందోనని జరిగిన విషయం తెలుసుకొని ఆమెను వెంటనే సమీపంలోని ఆసుపత్రికి తరలించారు. అనంతరం తన భర్తపై పోలీసు స్టేషన్ లో ఫిర్యాదు చేసింది. అవకాశం వస్తే తన ముక్కు కొరుక్కు తింటానని చెప్పి, అన్నంత పని చేశాడని చెప్పుకొచ్చింది.