ఖైదీ నెం.150 రీమేక్ సినిమానే అయినా దాన్ని తెలుగులో వండి వార్చడానికి చాలానే కష్టపడాల్సివస్తోంది. ఈ సినిమా కోసం పనిచేసిన రైటర్ల లిస్టు రోజురోజుకీ పెరుగుతోంది తప్ప తగ్గడం లేదు. పరుచూరి బ్రదర్స్ కత్తి సినిమాని తెలుగీకరించారు. ఆ తరవాత ఆకుల శివ కొంత భాగం మాటలు రాశాడు. ఎమోషన్ సీన్స్ అన్నింటికీ బుర్రా సాయిమాధవ్ మాటలు అందించాడు. ఇప్పుడు మరో రైటర్ కూడా చేయిచేసుకొన్నట్టు సమాచారం. సుకుమార్ సినిమాలకు మాటలు, స్క్రీన్ ప్లే విషయంలో సాయం చేసే హుస్సేన్ షా… ఈ సినిమాకి సంబంధించి కొన్ని కామెడీ సీన్లు రాశాడని సమాచారం. మాకు మేమే.. మీకు మీరే అనే సినిమాకి హుస్సేన్ షా డైరెక్షన్ కూడా చేశాడు.
ఖైది నెం.150లో అలీ, సునీల్, బ్రహ్మానందం వీళ్లు కనిపించే పోర్షన్ల కు… హుస్సేన్ షానే సంభాషణలు అందించాడని తెలుస్తోంది. కత్తి సినిమాకీ ఖైదీ నెం.150కీ ట్రీట్ మెంట్ పరంగా చాలా తేడాలున్నాయని తెలుస్తోంది. సీన్‌ని ఉన్నది ఉన్నట్టు దించకుండా.. కత్తి సినిమా చూసినవాళ్లకూ కాస్త కొత్తగా ఉండాలన్న ఉద్దేశంతో… సీన్లలోనూ స్క్రీన్ ప్లేలోనూ మార్పులు చేశారని సమాచారం. చిరు కామెడీ చేయడంలో దిట్ట. ఆయన శైలిని దృష్టిలో ఉంచుకొని ఫన్నీ పంచ్ డైలాగులు రాశాడట హుస్సేన్ షా. మరి ఆ డైలాగులు ఎంత వరకూ పేలాయో, సుకుమార్ శిష్యుడు చిరు సినిమాకి ఎంత హెల్ప్ అయ్యాడో తెలియాలంటే ఇంకొన్ని రోజులు ఆగాలి.