ఢిల్లీలో బాంబు పేలుడు తర్వాత అందరి దృష్టి హైదరాబాద్ పై పడింది. పోలీసులు వెంటనే అలర్ట్ అయిపోయారు. అనుమానాస్పద ప్రాంతాలన్నింటినీ జల్లెడ పట్టడం ప్రారంభించారు. ఒకప్పుడు దేశంలో ఉగ్ర కార్యకలాపాలు ఎక్కువగా ఉన్నప్పుడు.. ఎక్కడ ఏం జరిగినా హైదరాబాద్ లింక్ ఉండేది. హైదరాబాద్ లోనూ అభం, శుభం తెలియని ప్రజల్ని పేలుళ్లలో చంపేసేవారు. దిల్ సుఖ్ నగర్ సాయిబాబా గుడి.. గోకుల్ చాట్, లుంబిని పార్క్ ఇలాంటి పేలుళ్లు ఘటనలు హైదరాబాద్ ప్రజల్ని వణికించాయి.
ఈ మధ్య కాలంలో పట్టుబడిన అనేక మంది టెర్రరిస్టు సానుభూతిపరులు
గత పది, పదిహేనేళ్ల నుంచి టెర్రరిస్టుల దాడులు.. వారి ఉనికి తగ్గిపోయింది. దీనికి కారణం.. భారత నిఘా వర్గాలు అత్యంత ఉన్నత స్థాయిలో తీసుకున్న చర్యలే కారణం. ఈ పదేళ్ల కాలంలో చాలా మంది టెర్రరిస్టు సానుభూతిపరుల్ని నిఘా పెట్టి అరెస్టు చేశారు . అలా అరెస్ట్ అయిన వారిలో సాఫ్ట్ వేర్ ఉద్యోగులు కూడా ఉన్నారు. కొంత మంది స్లీపర్ సెల్స్ గా మారి.. ఏదో ఓ ఉద్యోగం చేస్తూ సమయం కోసం ఎదురు చూస్తూ ఉంటారు. ఇలాంటి వారందర్నీ కనిపెట్టే ప్రయత్నం చేశారు.
పూర్తి నిఘా – పటిష్టమైన భద్రతా ఏర్పాట్లు
హైదరాబాద్ పై టెర్రరిస్టుల పడగ నీడపై స్పష్టమైన సమాచారం పోలీసు శాఖకు ఉంటుంది. గతంలో ఉన్న అనుభవాలు.. హైదరాబాద్ లో పరిస్థితులు దానికి కారణం. గత ఇరవై ఏళ్లలో హైదరాబాద్ ఊహించనంతగా మారిపోయింది. గ్లోబల్ ఇమేజ్ పెరిగింది. హైదరాబాద్ ను టార్గెట్ చేస్తే ఉగ్రవాదులు మరింతగా తాను అనుకున్న పేరు సంపాదిస్తారు. అందుకే ముప్పు హైదరాబాద్కు ఎక్కువే ఉంటుంది. పోలీసులు ఈ విషయంలో హై అలర్ట్ గా ఉండాల్సిన అవసరం సహజంగానే ఉంటుంది.
ఏపీలోనూ పట్టుబడులు ఉగ్రవాదులు
విచిత్రంగా ఏపీలోని ధర్మవరం వంటి ప్రాంతాల్లో కరుడుగట్టిన టెర్రరిస్టుల్ని ఇటీవల పట్టుకున్నారు. వారు ఇండియన్ ముజాహిదిన్, జామాత్ ఏ ఇస్లామీ వంటి సంస్థల సానుభూతిపరులతో టచ్ లో ఉన్నట్లుగా గుర్తించారు. నిజానికి పట్టుబడిన వారు ఇక్కడి వారు కాదు. ఇద్దరు తమిళనాడు వారు.. అక్కడ కోయంబత్తూరులో అద్వానీపై హత్యాయత్నానికి పాల్పడిన వారు.. అలాగే ఇతర రాష్ట్రాల నుంచి వచ్చి అక్కడి వారితో కలసిపోయి బతుకుతూ..యువకుల్ని ఉగ్రవాదం వైపు మళ్లించే వారు ఉన్నారు. అందుకే ఏపీ ప్రభుత్వం కూడా జాగ్రత్తగా ఉండాల్సిన అవసరం కనిపిస్తోంది.


