ప్రముఖ టీవీ ఛానల్ రిపోర్టర్ల అరెస్టుపై వస్తున్న విమర్శలకు హైదరాబాద్ సీపీ సజ్జనార్ గట్టి కౌంటర్ ఇచ్చారు. ఈ అరెస్టులు అక్రమమైనవి కావని, పూర్తి చట్టప్రకారమే జరిగాయని ఆయన స్పష్టం చేశారు. మహిళా ఐఏఎస్ అధికారులపై ఎటువంటి ఆధారాలు లేకుండా అసత్య కథనాలు ప్రసారం చేసి, వారి వ్యక్తిత్వాన్ని కించపరచడం నేరమని ఆయన పేర్కొన్నారు. అరెస్టు చేసిన జర్నలిస్టులను కోర్టులో హాజరుపరుస్తామని, ఎవరినీ అక్రమంగా నిర్బంధించలేదని ఆయన వెల్లడించారు.
ఈ కేసును విచారిస్తున్న సిట్ అధికారులు నిందితులకు నోటీసులు ఇచ్చినప్పుడు విచారణకు హాజరుకావాల్సి ఉంటుందని సజ్జనార్ తెలిపారు. విచారణకు పిలిచినప్పుడు రాకుండా సెల్ ఫోన్లు స్విచ్ ఆఫ్ చేసుకోవడం దేనికి అని ఆయన ప్రశ్నించారు. విచారణ జరుగుతున్న తరుణంలో రాత్రికి రాత్రే బ్యాంకాక్ పారిపోవాల్సిన అవసరం ఏమొచ్చిందని ఆయన నిలదీశారు. అధికారులకు సహకరించకుండా పారిపోతుంటే పోలీసులు చట్టపరమైన చర్యలు తీసుకోవాల్సిందేనని ఆయన స్పష్టం చేశారు.
మహిళా అధికారులపై వ్యక్తిత్వ హననం చేయడం అనేది విమర్శ కాదు, అది ఒక రకమైన క్రూరత్వం అని సజ్జనార్ అభివర్ణించారు. ఏ ఆధారం ఉందని ఒక ఐఏఎస్ అధికారిణి వ్యక్తిగత జీవితాన్ని రోడ్డున పడేస్తారని ఆయన ప్రశ్నించారు. ఈ కేసులో ఎంతటి వారున్నా వదిలిపెట్టే ప్రసక్తి లేదని సీపీ తేల్చి చెప్పారు. సదరు ఛానల్ సీఈవో కూడా విచారణకు హాజరుకావాలని .. ఆయన కూడా అడ్రస్ లేరని అన్నారు. విచారణకు రాకపోతే అదుపులోకి తీసుకుంటామని హెచ్చరించారు.