2026 టీ20 ప్రపంచ కప్ షెడ్యూల్‌ను ఐసీసీ ప్రకటించింది. ఈ టోర్నీకి భారత్, శ్రీలంక సంయుక్తంగా ఆతిథ్యమివ్వనున్నాయి. ఫిబ్రవరి 7 నుంచి మార్చి 8 వరకు టోర్నమెంట్ జరగనుంది. ఈ సారి కూడా 20 జట్లు పాల్గొననున్నాయి. ఇటలీ మొదటిసారి టోర్నీకి అర్హత సాధించింది. ఈ మ్యాచ్‌లు భారత్‌లో అహ్మదాబాద్, దిల్లీ, కోల్‌కతా, చెన్నై, ముంబయి వేదికల్లో జరుగుతాయి. శ్రీలంకలో అయితే పల్లెకెలె, ప్రేమదాస, ఎస్ఎస్సీ వేదికల్లో నిర్వహిస్తారు.
భారత్ లో జరిగే మ్యాచులు వేదికలపై ముందుగానే ఒక అవగాహన వుంది. కానీ తెలుగు క్రికెట్ అభిమానులకు ఎక్కడో చిన్న ఆశ.. హైదరాబాద్ ని వేదిక చేస్తారని. కానీ ఇది అత్యాశ అని షెడ్యూల్ బయటికి వచ్చిన తర్వాత తేలిపొయింది. ఇప్పుడే కాదు గత కొన్నేళ్ళుగా బీసిసిఐ హైదరాబాద్ క్రికెట్ ని లైట్ తీసుకుంది. రాంచి, గౌహతి లాంటి చిన్న పట్టణాలకు అంతర్జాతీయ మ్యాచులు కేటాయిస్తారు కానీ హైదరాబాద్ కు ఆ భాగ్యం వుండదు.
దీనికి ప్రధాన కారణం హైదరాబాద్ క్రికెట్ అసోసియేషన్ లోని అంతర్గత కలహాలు, అవినీతి ఆరోపణలు. బోర్డ్ అస్థిరత. చివరికి బిసిసిఐ, ఫ్రాంచైజీలతో కూడా వివాదాలు. నగరానికి క్రికెట్లో గొప్ప చరిత్ర ఉన్నప్పటికీ నాయకత్వ లేమి, అంతర్గత ఘర్షణలతో అధోముఖంగా వెళుతోంది.
పెడదారి పట్టిన నిర్వహణ వల్ల నగరంలో క్రికెట్ అభివృద్ధికి సహకారం తగ్గిపోయింది. దీంతో ఇతర నగరాలతో పోలిస్తే హైదరాబాద్‌ను అంతర్జాతీయ మ్యాచ్‌ల కోసం ప్రాధాన్యత లేకపోవడం ప్రతిదశలో కనిపిస్తోంది. స్టేడియంలో మౌలిక వసతుల కూడా అంతమాత్రమే. ఉప్పల్ స్టేడియంలో కొన్ని అప్గ్రేడ్లు జరిగినా, పరిపాలనా సమస్యల కారణంగా అవసరమైన అంతర్జాతీయ స్థాయి ఆధునీకరణలు జరగలేదు. దీంతో పెద్ద టోర్నమెంట్లకు ఇది ప్రధాన వేదికగా మారకుండా పోయింది. చివరికి ఐపీఎల్ ఫ్రాంచైజీతో కూడా వివాదాలు పెట్టుకున్నారు. ఎస్ఆర్హెచ్ కూడా హోమ్ మ్యాచ్‌లను మరో నగరానికి మార్చేస్తామని హెచ్చరించిన సందర్భాలు ఉన్నాయి.
హైదరాబాద్ క్రికెట్ చరిత్ర ఘనమైనది.1 950ల్లో మొదటి టెస్ట్ మ్యాచ్‌ను ఆతిథ్యం ఇచ్చిన నగరంగా క్రికెట్ చరిత్రలో హైదరాబాద్ ప్రత్యేక స్థానం సంపాదించింది. అలాంటింది ఇప్పుడు ఇలా క్రికెట్ మ్యాప్ లో లేకుండా పోవడానికి దారితీసిన పరిస్థితులని గమనించుకోవాలి. హైదరాబాద్ క్రికెట్ అసోసియేషన్ లో భారీగా ప్రక్షాళనలు జరగాల్సిన అవసరం ఉంది. పూర్తి స్థాయి సంస్కరణలు జరిపి నిబద్దత, పారదర్శకతతో వ్యవహరించే అసోసియేషన్ వస్తేగానీ హైదరాబాద్ క్రికెట్ కు మళ్లీ కొత్త రోజులురావు.
