హైదరాబాద్ రియల్ ఎస్టేట్ రంగంలో తూర్పు ప్రాంతం ఇప్పుడు మధ్యతరగతి ప్రజలకు ఆశాదీపంగా మారుతోంది. పశ్చిమ హైదరాబాద్‌లోని హైటెక్ సిటీ, గచ్చిబౌలి, కోకాపేట వంటి ప్రాంతాల్లో సామాన్యుడు ఇల్లు కొనడం కలగా మారుతున్న తరుణంలో, ఉప్పల్, ప్రతాప సింగారం వంటి ప్రాంతాలు సరసమైన ధరలతో అందరినీ ఆకర్షిస్తున్నాయి.
హైదరాబాద్ పశ్చిమ ప్రాంతంలో రియల్ ఎస్టేట్ ధరలు చుక్కలను తాకుతుండటంతో, మధ్యతరగతి కుటుంబాలు ఇప్పుడు ప్రత్యామ్నాయాల వేటలో పడ్డాయి. ముఖ్యంగా ఐటీ కారిడార్‌లోని ఫ్లాట్ల ధరలు కోటికి చేరువవ్వడంతో, సామాన్యులు ఉప్పల్, బోడుప్పల్, ప్రతాప సింగారం వంటి తూర్పు ప్రాంతాల వైపు మొగ్గు చూపుతున్నారు. మెట్రో సౌకర్యం, మెరుగుపడిన రవాణా వ్యవస్థ మరియు ఐటీ కంపెనీల విస్తరణతో ఈ ప్రాంతాలు ఇప్పుడు నివాస యోగ్యంగా ఎదిగాయి.
ప్రస్తుతం మార్కెట్లో వస్తున్న ప్రకటనల ప్రకారం, ప్రతాప సింగారం, దాని పరిసరాల్లో రూ. 25 లక్షల నుంచే 2BHK ఫ్లాట్లు అందుబాటులో ఉంటున్నాయి.
స్టాండ్ ఎలోన్ అపార్ట్మెంట్లు , కొత్తగా వెలుస్తున్న వెంచర్లలో బడ్జెట్ ధరలకే ఇళ్లు దొరుకుతుండటంతో అటు సొంత ఇల్లు కొనేవారు, ఇటు పెట్టుబడిదారులు ఇక్కడికి క్యూ కడుతున్నారు. పశ్చిమ ప్రాంతంతో పోలిస్తే ఇక్కడ చదరపు అడుగు ధర దాదాపు సగం ఉండటం మధ్యతరగతి ప్రజలకు పెద్ద ఊరటగా మారింది.
ప్రభుత్వం చేపట్టిన లుక్ ఈస్ట్ పాలసీ వల్ల ఉప్పల్ భగయత్ , ఇతర ప్రాంతాల్లో మౌలిక సదుపాయాలు వేగంగా అభివృద్ధి చెందుతున్నాయి. నారపల్లి ఫ్లైఓవర్ పనులు పూర్తికావడం, వరంగల్ హైవేపై కనెక్టివిటీ పెరగడం వంటి అంశాలు ప్రతాప సింగారం వంటి శివారు ప్రాంతాలకు డిమాండ్‌ను పెంచాయి. గతంలో కేవలం శివారు గ్రామాలుగా ఉన్న ప్రాంతాలు, ఇప్పుడు ఆధునిక సౌకర్యాలతో కూడిన గేటెడ్ కమ్యూనిటీలకు వేదికగా మారుతున్నాయి.
తక్కువ బడ్జెట్లో నాణ్యమైన జీవనం కోరుకునే వారికి ఈ ప్రాంతాలు కేరాఫ్ అడ్రస్‌గా మారుతున్నాయి. రాబోయే రెండేళ్లలో ఈ ప్రాంతాల్లో ధరలు మరింత పెరిగే అవకాశం ఉండటంతో, ఇప్పుడే ఇల్లు కొనుగోలు చేయడం ఉత్తమమని రియల్ ఎస్టేట్ నిపుణులు సూచిస్తున్నారు.
