హైదరాబాద్ నగరంలో పెట్రోల్ బంకుల వద్ద కనిపిస్తున్న కిలోమీటర్ల కొద్దీ క్యూలు కనిపిస్తున్నాయి. రోజంతా ఆ రద్దీ ఉంటోంది. పోలీసులు సైతం క్యూలను కంట్రోల్ చేయడానికి రంగంలోకి దిగాల్సి వచ్చింది. దీంతో అసలు పెట్రోల్ కొరత లేదని అధికార యంత్రాగంం ప్రకటనలు చేస్తోంది. అయితే ప్రజల ఆందోళన కేవలం పుకార్ల వల్ల వచ్చిందని సరిపెట్టుకోవడం బాధ్యతారాహిత్యమే అవుతుంది. శ్రీలంక, పాకిస్థాన్ వంటి దేశాలు ఆర్థిక సంక్షోభంలో ఉన్నప్పుడు, రష్యా-ఉక్రెయిన్ యుద్ధం జరుగుతున్నప్పుడు కూడా మన దగ్గర కనిపించని పానిక్ బయింగ్ ఇప్పుడు ఎందుకు మొదలైందో నిర్ణయాలు తీసుకునేవాళ్లు ఆలోచించాలి. స్టాక్ ఉందని మాటల్లో చెప్పడం కంటే, బంకుల్లో స్టాక్ బోర్డులు మాయమై పెట్రోల్ దొరుకుతుందనే నమ్మకాన్ని కలిగించడంలో యంత్రాంగం విఫలమైంది.
ముందస్తు చెల్లింపుల ముప్పు
పెట్రోల్ బంకుల మూతకు అసలు కారణం ఆయిల్ కంపెనీలు అంతర్గతంగా తీసుకున్న ఒక వింత నిర్ణయమని తెలుస్తోంది. గతంలో ఇంధనం సరఫరా అయిన రెండు మూడు రోజుల తర్వాత చెల్లింపులు చేసే వెసులుబాటు బంకులకు ఉండేది. కానీ, ఇప్పుడు ముందు డబ్బు కడితేనే స్టాక్ అనే నిబంధనను కఠినతరం చేయడంతో చిన్న బంకులు నగదు సర్దుబాటు చేసుకోలేక చేతులెత్తేశాయి. ఇలాంటి సున్నితమైన సమయంలో, క్షేత్రస్థాయి పరిస్థితులు అర్థం చేసుకోకుండా బుర్ర ఉన్నవారెవరైనా’ ఇటువంటి నిర్ణయం తీసుకుంటారా అనేది ఎవరికైనా వచ్చే సందేహం. బంకులు మూసేస్తే ఆటోమేటిక్ గా పానిక్ రాక ఏమి వస్తుంది.
అధికారుల వైఫల్యం – ప్రజల ఇబ్బందులు
స్టాక్ తెచ్చుకోలేక బంకులు మూతపడటంతో సహజంగానే ప్రజల్లో భయం మొదలైంది. ఒక బంకు మూతపడితే అది పది బంకులకు పాకి, చివరకు నగరం మొత్తం అలజడికి దారితీసింది. ఇది ప్రజలు సృష్టించుకున్న సమస్య కాదు.. పరిస్థితులను అంచనా వేయకుండా నిర్ణయాలు తీసుకున్న అధికారుల అసమర్థత వల్లే ఏర్పడిన సంక్షోభం. బంకుల వద్ద ట్రాఫిక్ జామ్ అవుతున్నా, ప్రజలు పనులు మానుకుని క్యూలలో నిలబడుతున్నా.. కేవలం పుకార్లు నమ్మొద్దు అని ప్రకటనలు విడుదల చేయడం వల్ల ప్రయోజనం శూన్యం.
మాటలు వద్దు.. సరఫరా పెంచండి
ఇప్పుడున్న పరిస్థితుల్లో ప్రభుత్వం ఎన్ని వివరణలు ఇచ్చినా ప్రజలు నమ్మే స్థితిలో లేరు. వారికి కావాల్సింది గంటల కొద్దీ ప్రసంగాలు కాదు.. బంకుల్లో నిరంతరాయంగా దొరికే ఇంధనం. వెంటనే ఆయిల్ కంపెనీలతో మాట్లాడి, చెల్లింపుల నిబంధనలను తాత్కాలికంగా పక్కనపెట్టో లేదా అదనపు కోటాను విడుదల చేసో బంకులను నింపాల్సిన బాధ్యత అధికారులపై ఉంది. గంటల్లో పరిస్థితిని చక్కదిద్దకపోతే, ఈ కృత్రిమ కొరత మరింత తీవ్రమై నిత్యావసర వస్తువుల ధరల పెరుగుదలకు, సామాన్యుడి అదనపు భారానికి దారితీసే ప్రమాదం ఉంది.

