బతుకమ్మ కుంటకు చెందిన సుమారు ఏడు ఎకరాల భూమి విషయంలో యథాతథ స్థితి కొనసాగించాలని 2025 జూన్‌లో హైకోర్టు స్పష్టమైన ఆదేశాలు ఇచ్చింది. ఈ ఆదేశాలను బేఖాతరు చేస్తూ హైడ్రా అక్కడ నిర్మాణ పనులు చేపట్టడం, బోర్డులు ఏర్పాటు చేయడంపై న్యాయస్థానం తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేసింది. ఇది కోర్టు ధిక్కరణ కిందకు వస్తుందని పేర్కొంటూ, కమిషనర్ రంగనాథ్‌ను దోషిగా తేల్చింది. చట్టాన్ని అమలు చేయాల్సిన బాధ్యత గల అధికారులే న్యాయస్థాన ఉత్తర్వులను ఉల్లంఘించడంపై ధర్మాసనం అభ్యంతరం వ్యక్తం చేసింది.
కోర్టు దగ్గర షో చేయవద్దు!
బతుకమ్మ కుంటను చెరువుగా మార్చడం, ఆ వివాదాస్పద స్థలంలో సంక్రాంతి వేడుకలు నిర్వహించడం, అక్కడ ఏర్పాటు చేసిన బహిరంగ సభలో కమిషనర్ ప్రసంగించడంపై హైకోర్టు ఘాటు వ్యాఖ్యలు చేసింది. మీరు ప్రజల ముందు ప్రదర్శనలు ఇచ్చుకోవచ్చు కానీ, కోర్టు దగ్గర కాదు అంటూ కమిషనర్‌కు హెచ్చరికలు జారీ చేసింది. కోర్టులో కేసు పెండింగ్‌లో ఉన్నప్పుడు, ఆ భూమిపై హక్కులు ఉన్నట్లుగా వ్యవహరించడం, పబ్లిక్ పోస్టరింగ్ చేయడం ఆమోదయోగ్యం కాదని న్యాయమూర్తులు స్పష్టం చేశారు.
నాలుగు వారాల గడువు
కోర్టు ఆదేశాలకు విరుద్ధంగా బతుకమ్మ కుంట భూమిలో ఏర్పాటు చేసిన అన్ని రకాల నిర్మాణాలు, సూచిక బోర్డులు , మార్కర్లను తక్షణమే తొలగించాలని హైకోర్టు ఆదేశించింది. సదరు భూమిని 2025 జూన్ 12 నాటికి ఏ స్థితిలో ఉందో, అదే స్థితికి తీసుకురావాలని స్పష్టం చేసింది. ఈ ప్రక్రియ మొత్తాన్ని నాలుగు వారాల్లో పూర్తి చేసి, తదుపరి నివేదికను సమర్పించాలని హైడ్రా యంత్రాంగాన్ని ఆదేశించింది.
న్యాయపరమైన చిక్కులు
చెరువుల పునరుద్ధరణ పేరుతో ఇటీవల కాలంలో ప్రచారం పొందుతున్న రంగనాథ్‌కు, ఈ కోర్టు ధిక్కరణ తీర్పు ఇబ్బందికరంగా మారింది. గతంలోనే ఆయన కోర్టుకు హాజరై నిబంధనల ఉల్లంఘనపై షరతులు లేని క్షమాపణ కోరినప్పటికీ, పదే పదే అదే ధోరణి కొనసాగడంపై కోర్టు అసహనం వ్యక్తం చేసింది. కేవలం జరిమానా విధిస్తే సరిపోదని, బాధితుడి హక్కులను కాపాడటమే అసలైన న్యాయమని పేర్కొంటూ కోర్టు ఇచ్చిన ఈ తీర్పు రంగనాథ్‌కు సమస్యలు సృష్టించే అవకాశం కనిపిస్తోంది.
