దేశంలోనే అతిపెద్ద ప్రభుత్వ-ప్రైవేట్ భాగస్వామ్యం మోడల్లో నిర్మించిన హైదరాబాద్ మెట్రో రైలు ప్రాజెక్టును ప్రభుత్వ స్వాధీనంలోకి తీసుకోవాలని నిర్ణయించింది. హైదరాబాద్ మెట్రోను ప్రభుత్వం స్వాధీనం చేసుకోవాలంటే సుమారు రూ.15,000 కోట్ల నుంచి రూ.18,000 కోట్ల వరకు నిధులు అవసరమని అంచనా. ప్రాజెక్టు అప్పులు, ఎల్ అండ్ టీ పెట్టుబడి, ఇతర నిర్వహణ ఖర్చులను లెక్కగడితే ఈ మొత్తం భారీగా ఉంటుంది.
ఇప్పటికే రాష్ట్ర బడ్జెట్‌పై ఒత్తిడి ఉన్న సమయంలో , కేంద్ర ప్రభుత్వ సహాయం కోరాలా లేక విదేశీ రుణ సంస్థల ద్వారా నిధులు సమీకరించాలా అనే అంశంపై ఆర్థిక శాఖ కసరత్తు చేస్తోంది. మెట్రో ప్రాజెక్టు ప్రభుత్వ చేతుల్లోకి వస్తే, రెండో దశ విస్తరణ పనులు మరింత వేగవంతం అవుతాయని ప్రభుత్వం భావిస్తోంది. విమానాశ్రయ మార్గం, పాతబస్తీ మెట్రో వంటి కీలక మార్గాల్లో నిర్ణయాలు తీసుకోవడం ప్రభుత్వానికి సులభతరం అవుతుంది. ప్రైవేట్ భాగస్వామి నిబంధనల అడ్డంకులు లేకుండా, ప్రభుత్వం సొంతంగా నిధులు కేటాయించి నగరం నలుమూలలా మెట్రోను విస్తరించే అవకాశం ఉంటుంది.
హైదరాబాద్ మెట్రో స్వాధీనం అనేది కేవలం ఒక వ్యాపార లావాదేవీ మాత్రమే కాదు, ఇది నగర ప్రజా రవాణా ముఖచిత్రాన్ని మార్చే అతిపెద్ద నిర్ణయం. ఎల్ అండ్ టీ నుంచి వాటాల బదిలీకి సంబంధించి ప్రస్తుతం చర్చలు తుది దశలో ఉన్నాయి. ప్రభుత్వం క్లారిటీ ఇస్తే, రాబోయే కొద్ది నెలల్లోనే హైదరాబాద్ మెట్రో పూర్తి స్థాయిలో ప్రభుత్వ సంస్థగా రూపాంతరం చెందనుంది. ఆ తర్వాతే మెట్రో విస్తరణ గురించి అడుగులు ముందుకు పడే అవకాశం ఉంది.
