హైదరాబాద్ మెట్రో రైలు ప్రాజెక్టును ఎల్ అండ్ టీ సంస్థ నుంచి రాష్ట్ర ప్రభుత్వం పూర్తిగా తన ఆధీనంలోకి తీసుకునే ప్రక్రియ అత్యంత కీలక దశకు చేరుకుంది. ఈ భారీ ప్రాజెక్టును ప్రభుత్వపరం చేయాలంటే కేవలం అడ్మినిస్ట్రేటివ్ మార్పులు మాత్రమే సరిపోవు, వేల కోట్ల రూపాయల ఆర్థిక లావాదేవీలను పరిష్కరించాల్సి ఉంది. పబ్లిక్ ప్రైవేట్ పార్టనర్షిప్ నమూనా నుంచి మెట్రోను ప్రభుత్వ రంగ సంస్థగా మార్చే క్రమంలో ప్రభుత్వం సుమారు 15,000 కోట్ల భారాన్ని భరించాల్సి ఉంటుందని అంచనా.
అప్పుల కుప్పే అసలు సవాలు
ప్రభుత్వం ఈ ప్రాజెక్టును స్వాధీనం చేసుకోవాలంటే ప్రధానంగా ఎల్ అండ్ టీ మెట్రో సంస్థకున్న భారీ అప్పును తన ఖాతాలో వేసుకోవాల్సి ఉంటుంది. ప్రస్తుతం హైదరాబాద్ మెట్రో ఫేజ్-1పై సుమారు 13,000 కోట్ల అప్పు ఉంది. దీనికి అదనంగా, ఎల్ అండ్ టీ సంస్థ ఈ ప్రాజెక్టులో పెట్టిన ఈక్విటీ పెట్టుబడికి ప్రతిఫలంగా ప్రభుత్వం మరో 2,000 కోట్ల నుంచి 2,100 కోట్ల వరకు వన్-టైమ్ సెటిల్మెంట్ కింద చెల్లించాల్సి ఉంది. ఈ మొత్తాన్ని సమీకరించడం రాష్ట్ర ఖజానాపై పెద్ద ఒత్తిడిని కలిగించే అంశమే.
న్యాయపరమైన చిక్కులు
ఈ టేకోవర్ ప్రక్రియ కోసం ఇప్పటికే ప్రభుత్వం ఐడీబీఐ క్యాపిటల్‌ను ఆర్థిక సలహాదారుగా, ఢిల్లీ మెట్రో రైల్ కార్పొరేషన్ ను సాంకేతిక సలహాదారుగా నియమించింది. వీరి నివేదికల ప్రకారం.. ఎల్ అండ్ టీకి చెల్లించాల్సిన బకాయిలతో పాటు, గతంలో కుదుర్చుకున్న సప్లిమెంటరీ కన్సెషన్ అగ్రిమెంట్ల ప్రకారం ప్రభుత్వం ఇవ్వాల్సిన 2,100 కోట్ల వడ్డీ లేని రుణం అంశం కూడా చర్చల్లో ఉంది. ఈ నెల 23న జరిగే కేబినెట్ భేటీలో ఈ బకాయిల చెల్లింపు పద్ధతిపై తుది నిర్ణయం తీసుకోనున్నారు. మెట్రో ప్రాజెక్టు లాభాల్లోకి రాకపోవడం, ఏటా వందల కోట్ల రూపాయల నష్టాలు వస్తుండటంతో ఎల్ అండ్ టీ ఈ ప్రాజెక్టు నుంచి తప్పుకోవాలని నిర్ణయించుకుంది. ఫేజ్-2 విస్తరణలో భాగస్వామిగా ఉండాలని ప్రభుత్వం కోరినప్పటికీ, ఎల్ అండ్ టీ అందుకు నిరాకరించి తన వాటాను పూర్తిగా వదులుకోవడానికి మొగ్గు చూపింది. దీంతో కేంద్ర ప్రభుత్వం నుంచి ఫేజ్-2 ఆమోదం పొందాలంటే ఈ టేకోవర్ ప్రక్రియను వేగంగా పూర్తి చేయడం రాష్ట్ర ప్రభుత్వానికి తప్పనిసరిగా మారింది.
మార్చి 31 డెడ్‌లైన్
ఆర్థిక సంవత్సరం ముగిసేలోగా, అంటే మార్చి 31 నాటికి మొత్తం ప్రక్రియను పూర్తి చేసి, మెట్రోను పూర్తిగా ప్రభుత్వ సంస్థగా మార్చాలని సీఎం రేవంత్ రెడ్డి లక్ష్యంగా పెట్టుకున్నారు. ఇందుకు అవసరమైన నిధుల సమీకరణ కోసం వివిధ మార్గాలను ప్రభుత్వం అన్వేషిస్తోంది. కేబినెట్ ఆమోదం లభించిన వెంటనే రుణాల బదిలీ , ఆస్తుల అప్పగింత ప్రక్రియ ప్రారంభం కానుంది. ఇది పూర్తయితే హైదరాబాద్ మెట్రో రైల్ పూర్తిగా ప్రభుత్వ నియంత్రణలోకి వస్తుంది.