దేశవ్యాప్తంగా రియల్ ఎస్టేట్ రంగంలో మిశ్రమ ఫలితాలు కనిపిస్తున్నా, భాగ్యనగరం మాత్రం తన జోరును కొనసాగిస్తోంది. ముంబై, బెంగళూరు వంటి మెట్రో నగరాల్లో ఇళ్ల విక్రయాలు నెమ్మదించినా, హైదరాబాద్ రియల్ మార్కెట్ సరికొత్త రికార్డులను సృష్టిస్తోంది. తాజా గణాంకాల ప్రకారం, ఇతర నగరాల్లో ఇళ్ల విక్రయాలు ఆశించిన స్థాయిలో లేకపోయినా, హైదరాబాద్‌లో మాత్రం 12-14 శాతం వృద్ధి నమోదైంది.
2025 చివరి త్రైమాసికంలో ప్రారంభమైన ఈ సానుకూల ధోరణి, 2026లోనూ అదే వేగంతో కొనసాగుతున్నాయి. దేశ ఆర్థిక రాజధాని ముంబై, ఐటీ హబ్ బెంగళూరు వంటి నగరాలను సైతం వెనక్కి నెట్టి, ఇళ్ల కొనుగోలుదారుల మొదటి ఎంపికగా హైదరాబాద్ నిలుస్తోంది. హైదరాబాద్‌లో ఈ స్థాయిలో డిమాండ్ పెరగడానికి ప్రధాన కారణం ఇక్కడి మెరుగైన మౌలిక సదుపాయాలు, సాపేక్షంగా తక్కువగా ఉన్న జీవన వ్యయం. పశ్చిమ హైదరాబాద్‌లోని ఐటీ కారిడార్‌తో పాటు, ఇప్పుడు తూర్పు, దక్షిణ ప్రాంతాల్లోనూ కొత్త ప్రాజెక్టులు వెలుస్తుండటం ఇన్వెస్టర్లను ఆకర్షిస్తోంది.
అంతర్జాతీయ ప్రాపర్టీ కన్సల్టెన్సీ నివేదికల ప్రకారం, ముంబైలో స్థలాల కొరత , బెంగళూరులో ట్రాఫిక్, మౌలిక వసతుల సమస్యల వల్ల ఇన్వెస్టర్లు ప్రత్యామ్నాయాల వైపు చూస్తున్నారు. ఈ క్రమంలో విస్తృతమైన రోడ్లు, మెట్రో కనెక్టివిటీ , స్థిరమైన ప్రభుత్వం వంటి అంశాలు హైదరాబాద్‌కు కలిసొచ్చాయి. కేవలం నివసించడానికే కాకుండా, భవిష్యత్తులో మంచి రిటర్న్స్ వస్తాయనే నమ్మకంతో ఇతర రాష్ట్రాల వారు కూడా ఇక్కడ పెట్టుబడులు పెట్టడానికి ఆసక్తి చూపుతున్నారు.
ప్రస్తుత ట్రెండ్ చూస్తుంటే, 2026 ఏడాది మొత్తం హైదరాబాద్ రియల్ ఎస్టేట్ రంగానికి స్వర్ణయుగంగా మారే సూచనలు కనిపిస్తున్నాయి. ధరలు పెరుగుతున్నప్పటికీ, కొనుగోలుదారులు వెనకడుగు వేయకపోవడం మార్కెట్ స్థిరత్వానికి నిదర్శనం. ముఖ్యంగా గేటెడ్ కమ్యూనిటీలు, హైరైజ్ అపార్ట్మెంట్లకు ఉన్న క్రేజ్ ఇప్పట్లో తగ్గేలా లేదని మార్కెట్ వర్గాలు అభిప్రాయపడుతున్నారు.
