హైదరాబాద్ శివారులోని పాశమైలారం ఇండస్ట్రియల్ ప్రాంతంలో ఉన్న సిగాచి ఇండస్ట్రీస్ లో జరిగిన ప్రమాదంలో కనీసం నలభై మంది వరకూ చనిపోయారు. వీరిలో చాలా మంది ఆనవాళ్లు కూడా గుర్తు పట్టలేని విధంగా మారిపోయింది. తెలంగాణ చరిత్రలో ఇది అతి పెద్ద పారిశ్రామిక ప్రమాదం. ఫార్మా ఇండస్ట్రికి కేంద్రంగా ఉన్న హైదరాబాద్ చుట్టుపక్కల ఫార్మా కంపెనీల ఉత్పత్తి కేంద్రాలు, వాటికి ముడిపదార్థాలు తయారు చేసే కంపెనీలు చాలా ఉన్నాయి. వాటిలో కొన్ని ప్రమాదాలు జరిగాయి కానీ.. ఇంత భారీ ప్రమాదం ఇటీవలి కాలంలో చోటు చేసుకోలేదు.
కెమికల్ ఫ్యాక్టరీల్లో నిర్లక్ష్యాల వల్ల ప్రమాదాలు
ఇలాంటి కెమికల్ పరిశ్రమల్లో రియాక్టర్ల పేలుడు ప్రధాన కారణం అవుతుంది. అవి పేలితేనే ఇంత తీవ్రమైన ప్రమాదం జరుగుతుంది. ఇక్కడ రియాక్టర్ పేలిందో లేదో చెప్పలేకపోతున్నారు. మరి ఇంత తీవ్రమైన పేలుడు ఎందుకు జరిగిందన్నదానిపై భిన్నాభిప్రాయాలు వినిపిస్తున్నాయి. కేవలం చిన్న నిర్లక్ష్యం వల్లనే ఇన్ని ప్రాణాలు పోయాయన్నా భావన వ్యక్తమవుతోంది. సిగాచి పరిశ్రమలో తయారు చేసే .. కెమికల్ .. ప్రాసెస్ లో భయంకరమైన వేడి వస్తుంది. ఆ వేడిని చల్లబర్చడానికి ప్రత్యేకమైన ఏర్పాట్లు ఉంటాయి. ఆ యంత్రాలు సరిగ్గా పని చేస్తున్నాయో లేదో రెగ్యులర్గా చెక్ చేయకపోవడంతో వాటి పనితీరు మందగించి వేడి పెరిగిపోయిందని.. దాని వల్లనే భారీ పేలుడు సంభవించిందని ప్రాథమికంగా నిర్ణయించారు.
రోడ్డున పడుతున్న కుటుంబాలు
ఇలాంటి ప్రమాదాలు జరిగినప్పుడు ప్రాణనష్టం ఎక్కువగా ఉంటుంది. 150 మంది వరకూ పేలుడు జరిగినప్పుడు విధుల్లో ఉన్నారు. ఆ తర్వాత అంతా గందరగోళంగా మారింది. ఎవరు బతికి ఉన్నారో.. ఎవరు చనిపోయారో తెలియడం లేదు. పేలుడు సమయంలో సిగాచి వైస్ ప్రెసిడెంట్ కూడా.. అడ్మినిస్ట్రేటివ్ బిల్డింగ్ లో ఉన్నారు. ఆ బిల్డింగ్ కూలిపోవడంతో ఆయన కూడా చనిపోయారు. మొదట ప్రమాద తీవ్రత ఈ స్థాయిలో ఉంటుందని అనుకోలేదు.కానీ శిథిలాలు తొలగించే కొద్దీ బయటపడుతున్న మృతదేహాలతో పరిస్థితి భయంకరంగా ఉందని గుర్తిస్తున్నారు.
పరిశ్రమలన్నీ సేఫ్టీ ఆడిట్ చేయించుకోవాల్సిందే!
పారిశ్రామిక రక్షణ విషయంలో వంద శాతం రెగ్యులర్ చెకప్స్ ఉండాలని నిబంధనలు చెబుతున్నాయి. ప్రతీ రోజూ…ప్రమాదాలకు కారణం అవుతాయని భావించే పరికరాల పనితీరును పరిశీలించాల్సి ఉంటుంది. చాలా పరిశ్రమల్లో సిబ్బంది నిర్లక్ష్యం.. ఉన్నతాధికారుల పర్యవేక్షణ లోపం వల్ల.. చిన్న చిన్న తప్పిదాలే భారీ ప్రమాదాలకు కారణం అవుతున్నాయి. సిగాచిలో జరిగింది ఇదే. ఈ ప్రమాదం.. తెలంగాణ పారిశ్రామిక రంగానికి పెనువిషాదం లాంటిది. మరోసారి ఇలాంటివి జరగకుండా అన్ని పరిశ్రమలు సెక్యూరిటీ ఆడిట్ చేయించుకోవాల్సిన అవసరం కనిపిస్తోందని నిపుణులు చెబుతున్నారు.