పండగ సీజన్ అంటే అన్ని రకాల వ్యాపారాలకు ఓ మంచి అవకాశం. అందరూ మంచిరోజులు చూసుకుని తాము మిగుల్చుకున్న సొమ్ములతో కొనాలనుకున్నవి కొంటూంటారు. అందులో ఇళ్లు కూడా ఉంటాయి. అందుకే ఇప్పుడు రియల్ ఎస్టేట్ ఇండస్ట్రీ అలర్ట్ అయింది. పండగ సీజన్ రావడంతో రెడీ టు మూవ్ ఇళ్లను గరిష్టంగా అమ్ముకునేందుకు ప్లాన్లు రెడీ చేసుకుంటోంది.
హైదరాబాద్ లో అమ్మకం కాని ఇళ్లు సంఖ్య పెరుగుతున్నట్లుగా ఇటీవలి నివేదికలు చెబుతున్నాయి. దానికి కారణం ధరలతో పాటు వేచి చూద్దామనుకునే ప్రజల ధోరణి కూడా. వినియోగదారులు ఇప్పుడిప్పుడే ఎంక్వయిరీలు ప్రారంభించారు. పండగకు కొంత నగదు బోనస్‌ల రూపంలో సమకూరే అవకాశం ఉండటంతో.. తమ ఇంటి కలను నెరవేర్చుకునేందుకు ముందడుగు వేసేందుకు ప్రయత్నిస్తున్నారు. ఈ అవకాశాలను అంది పుచ్చుకునేందుకు.. డిస్కౌంట్లు , ఆఫర్లు ఇచ్చేందుకు రియల్ ఎస్టేట్ కంపెనీలు ముందుకు వస్తున్నాయి.
సాధారణ డిమాండ్ కన్నా.. పండుగల సమయంలో ఇళ్ల కోసం ఎంక్వయిరీలు, బుకింగులు, రిజిస్ట్రేషన్లు ఎక్కువగా ఉంటాయి. ఈ సారి కూడా అలాగే ఉండేలా చేయాలంటే.. బిల్డర్లు కూడా కాస్త ధరలు తగ్గించుకుని ఆకర్షణీయమైన మార్కెటింగ్ పాటించాల్సి ఉంటుంది. ఒక సారి రియల్ ఎస్టేట్ ఊపందుకుంటే.. మొత్తం వ్యాపారం ఊపందుకుంటుంది. అన్ని వ్యాపారాలూ కళకళలాడతాయి.