హైదరాబాద్ లో ఇప్పుడు బిల్డర్లు ఎంత ఎత్తుకు ఇళ్లు కడదామా అన్న ఆలోచనలోనే ఉన్నారు. దానికి తగ్గట్లుగా ప్రభుత్వం కూడా అనుమతులు మంజూరు చేస్తోంది. అందుకే హైదరాబాద్ లో హై-రైజ్ బూమ్ కనిపిస్తోంది. హైదరాబాద్ ఇప్పటి వరకు అనుమతి తీసుకున్న అతి పెద్ద ప్రాజెక్టుల్లో ఒకటి 63 అంతస్తులుఉంది. 56 అంతస్తుల 5 బ్లాకుల ప్రాజెక్టు కూడా ఒకటి రాబోతోంది. జనవరి నుంచి సెప్టెంబర్ వరకు HMDA 77 మల్టీ-స్టోరీ భవన (MSB) ప్రాజెక్టులకు అనుమతి ఇచ్చింది. 78.7 లక్షల చదరపు మీటర్ల ప్రాంతం ఈ నిర్మాణాలతో అందుబాటులోకి వస్తుంది. ఈ ప్రాజెక్టులకు అనుమతి ఇవ్వడం వల్ల హెచ్ఎండీఏకు మొత్తం రెవెన్యూ రూ.1,225 కోట్లు వచ్చింది. గత ఏడాదితో పోలిస్తే ఇది 245 శాతం పెరుగుదల. ఈ అభివృద్ధి హైదరాబాద్‌ను ముంబై తర్వాత భారతదేశంలో రెండో అత్యధిక స్కైస్క్రాపర్లు కలిగిన నగరంగా మార్చుతోంది.
నియోపొలిస్, కోకాపేటలోనే ఎక్కువగా ఈ ప్రాజెక్టులు ఉన్నాయి. అయితే ఇతర ప్రాంతాల్లోనూ తక్కువేమీ లేవు. బండ్లగూడ జాగీర్‌లో 30 అంతస్తులు, 47 అంతస్తుల టవర్ ప్రాజెక్టులకు అనుమతులు ఇచ్చారు. ఇవి మధ్య తరగతి కుటుంబాలకు అనుకూలమైన హౌసింగ్ ఆప్షన్లను అందిస్తాయి. హైదరాబాద్‌లో 2025 నాటికి 158 స్కైస్క్రాపర్లు అంటే 150 మీ. ఎత్తు పైబడినవి నిర్మాణంలో ఉన్నాయి. SAS క్రౌన్ G+57 అంతస్తులు ఇప్పటికే హ్యాండ్ఓవర్ సిద్ధంగా ఉంది.
హెచ్ఎండీఏకు జనవరి-సెప్టెంబర్ 2025లో 3,677 అప్లికేషన్లు వచ్చాయి. 2,887కు అనుమతులు ఇచ్చారు. 8.8 మిలియన్ చ.మీ. లేఅవుట్ అనుమతులు ఇచ్చారు. ఓపెన్ ప్లాట్లకు 2,862 ఎకరాలు , హౌసింగ్‌తో 38.24 లక్షల చ.మీటర్ల మేర అనుమతి ఇచ్చినట్లయింది. వేగవంతమైన క్లియరెన్స్. ట్రాఫిక్ అసెస్మెంట్లు, భవిష్యత్ ఇన్ఫ్రా పరిగణనలో అనుమతులు ఇస్తున్నారు. అందుకే హైదరాబాద్ రియల్ ఎస్టేట్‌లో హై రైజ్ శకం ప్రారంభమయిందని అనుకోవచ్చు.