విశ్వ నగరంగా మారుస్తారుకుంటే గుంతల నగరంగా మారడంతో హైదరాబాదీలు అష్టకష్టాలు పడుతున్నారు. అందుకే, కేసీఆర్, కేటీఆర్ లు దీన్ని విశ్వ గుంతల నగరంగా మార్చారని తెలుగు దేశం పార్టీ విమర్శిస్తోంది. తెరాస హయాంలో హైదరాబాద్ బ్రాండ్ ఇమేజి గుంతల నగరం స్థాయికి పడిపోయిందని కాంగ్రెస్ నేతలు విమర్శిస్తున్నారు. రోడ్లను బాగు చేయండని ధర్నాలు చేసే ప్రతిపక్షాలపై ఎప్పట్లాగే అధికార పార్టీ ఫైర్ అవుతోంది.
అదేంటో, రెండు ప్రతిపక్షాలు ధర్నాలు చేసే దాకా నగరంలో రోడ్లు ఎంత దరిద్రంగా ఉన్నాయో మంత్రి కేటీఆర్ కు తెలియనట్టుంది. మొత్తానికి ఆగమేఘాల మీద ఓ మీటింగ్ పెట్టేశారు. అసలు రోడ్ల పరిస్థితిని ఏమాత్రం పట్టించుకున్నట్టు కనిపించని మేయర్ ను పక్కన కూర్చోబెట్టుకుని అధికారులకు ఆదేశాలు జారీ చేశారు. 150 ప్రత్యేక బృందాలతో రోడ్ల మరమ్మతు చేయించాలని ఆర్డర్ వేశారు. అంటే డివిజన్ కు ఒక బృందం. పోనీ, ఈ పనైనా సక్రమంగా జరుగుతుందో లేదో తెలియాలంటే ఓ నాలుగు రోజులు ఆగాలి. అయితే, తన పార్టీకే చెందిన మేయర్, కార్పొరేటర్లు ఏం చేస్తున్నారని ప్రశ్నించాలనే ఆలోచనే ఆయనకు వచ్చినట్టు లేదు. ఆ మధ్య అర్ధరాత్రి వేళ రోడ్లపై తిరిగిన మంత్రివర్యులు, దాని వల్ల ఫలితం ఎంత వరకు వచ్చిందని గమనిస్తే ఇంకాస్త ముందే స్పందించే వారేమో.
హైదరాబాదు రోడ్లు ఇంత అధ్వాన్నంగా ఎప్పుడూ లేవంటున్నారు నగరవాసులు. బంగారు తెలంగాణ సాధిస్తామన్న వారి జమానాలోనే నగరం నాశనం అవుతోందని ప్రతిపక్షాలు తీవ్రంగా దుయ్యబడుతున్నాయి. రాష్ట్రాన్ని, నగరాన్ని సర్వనాశనం చేసే పార్టీగా తెరాసను విమర్శిస్తున్నాయి. అయినా, ప్రభుత్వానికి అధికార యంత్రాంగంపై పట్టు లేనట్టుంది.
స్వయంగా గత నెలలో ముఖ్యమంత్రి కేసీఆర్ అధికారులకు సూచనలు చేశారు. నగరంలో రోడ్లను సమూలంగా బాగు చేయడానికి దశల వారీగా చర్యలు తీసుకోవాలని ఆదేశించారు. మొదటి దశలో 100 కిలోమీటర్ల బీటీ రోడ్లు మళ్లీ వేయడానికి టెండర్లు పిలవండని చెప్పారు. గుంతలు పూడ్చే పని యుద్ధ ప్రాతిపదికన చేయాలని సూచించారు. అయినా, షరా మామూలే. వరసగా కురుస్తున్న భారీ వర్షాలకు ఉన్న రోడ్లు కూడా పాడైపోయాయి.
కేవలం రోడ్లు దరిద్రంగా ఉండటం వల్ల ట్రాఫిక్ జామ్ కావడం అనేది హైదరాబాద్ ప్రత్యేకతగా మారింది. గోతులు దాటడానికి వాహనాలు నెమ్మదిగా కదలడం వల్ల అనేక చోట్ల వాహనాలు అతి నెమ్మదిగా కదులుతున్నాయి. వాహన దారులకు నరకం చూపించే ఈ సమస్యను కేసీఆర్ ప్రభుత్వం పరిష్కరించగలదా? ఏమో !!