తెలంగాణ రాజధాని హైదరాబాద్ లో రియల్ ఎస్టేట్ గురించి చెప్పాల్సి వస్తే అరవై శాతం హైదరాబాద్ వెస్ట్ ప్రాంతం గురించి మాట్లాడుకోవాలి. ఎందుకంటే రియల్ ఎస్టేట్ లావాదేవీల్లో సగం అక్కడే కేంద్రీకృతమై ఉంటున్నాయి. ఇళ్లు, ఆఫీసుల నిర్మాణం అక్కడే. రాపిడ్గా అభివృద్ధి చెందుతున్న ప్రాంతాలన్నీ వెస్ట్ లోనే ఉన్నాయి. గేటెడ్ కమ్యూనిటీల్లోఅత్యధికం అక్కడే నిర్మితం అవుతున్నాయి.
హైదరాబాద్‌లోని ఐటీ కారిడార్‌లో ఉన్న గచ్చిబౌలి, అనేక గేటెడ్ కమ్యూనిటీలకు కేంద్రంగా ఉంది. ఇక్కడ హైటెక్ సిటీ, ఫైనాన్షియల్ డిస్ట్రిక్ట్ వంటివి ఉపాధి కేంద్రాలుగా ఉన్నాయి. కొండాపూర్, గేటెడ్ కమ్యూనిటీలకు మరో ప్రధాన కేంద్రం. ఇక్కడ అనేక రియల్ ఎస్టేట్ ప్రాజెక్టులు, ముఖ్యంగా హై-రైజ్ అపార్ట్మెంట్లు , గేటెడ్ విల్లా కమ్యూనిటీలు నిర్మించారు. గచ్చిబౌలికి సమీపంలో ఉన్న నల్లగండ్ల, ప్రశాంతంగా ఉండే నివాస ప్రాంతంగా , గేటెడ్ కమ్యూనిటీలకు కేంద్రంగా మారింది. ఇక్కడ అనేక అపార్ట్మెంట్ కాంప్లెక్స్‌లు , విల్లా ప్రాజెక్టులు పూర్తయ్యాయి. ఇంకా అనే పెద్ద సంస్థల ప్రాజెక్టులు నిర్మాణంలో ఉన్నాయి.
ఐటీ కారిడార్ సమీపంలోని తెల్లాపూర్ కూడా గేటెడ్ కమ్యూనిటీలకు ప్రసిద్ధి చెందింది. ఇక్కడ లగ్జరీ విల్లాలు , అపార్ట్మెంట్లతో కూడిన పెద్ద పెద్ద ప్రాజెక్టులు నిర్మాణంలో ఉన్నాయి. గచ్చిబౌలి, కొండాపూర్, మాదాపూర్ వంటి ప్రాంతాలు ఐటీ ఉద్యోగులకు అనుకూలంగా ఉండటం వల్ల గేటెడ్ కమ్యూనిటీలకు డిమాండ్ ఎక్కువ. ఐటీ రంగంలో ఉండేవారు.. అధిక ఆదాయం ఉన్న వారు ఈ ప్రాంతంలోనే ఆస్తులు కొనుగోలు చేసేందుకు ఆసక్తి చూపిస్తున్నారు.