దుండిగల్ మండలంలోని మల్లంపేట – బాచుపల్లి గ్రామాల మధ్య గత కొంతకాలంగా నెలకొన్న రహదారి వివాదానికి తెరపడింది. హైకోర్టు మార్గదర్శకాలను అనుసరించి, ప్రణీత్ ఆంటిల్యా కమ్యూనిటీ వద్ద రహదారికి అడ్డంగా ఉన్న ప్రహరీ గోడను హైడ్రా సోమవారం తొలగించింది. దీంతో వేలాది మంది వాహనదారులకు 5 కిలోమీటర్ల అదనపు ప్రయాణ దూరం తగ్గడమే కాకుండా, నేరుగా బాచుపల్లి మీదుగా ప్రగతినగర్ చేరుకునే సౌలభ్యం కలిగింది.
కోర్టు ఉత్తర్వుల మేరకు చర్యలు
మల్లంపేటలో 40 అడుగుల ప్రజా రహదారికి అడ్డంగా ప్రణీత్ ఆంటిల్యా నిర్వాహకులు గోడ నిర్మించారంటూ హైడ్రాకు ఫిర్యాదులు అందాయి. దీనిపై స్పందించిన హైడ్రా నోటీసులు జారీ చేయగా, నిర్వాహకులు హైకోర్టును ఆశ్రయించారు. సరైన విధానం అనుసరించాలని కోర్టు సూచించడంతో, హైడ్రా ఇరుపక్షాలను పిలిచి విచారణ చేపట్టింది. HMDA అనుమతించిన లేఅవుట్ ప్రకారం అది గేటెడ్ కమ్యూనిటీ కాదని, నిబంధనల మేరకు ప్రత్యేక దారుల కేటాయింపులు జరగలేదని నిర్ధారించుకున్నాకే హైడ్రా ఈ కూల్చివేత చేపట్టింది. గోడ తొలగించిన వెంటనే HMDA బిటి రోడ్డు పనులను కూడా ప్రారంభించింది.
ప్రయాణికులకు భారీ ఊరట
ఈ గోడ తొలగింపుతో మల్లంపేట ప్రాంత నివాసితుల ఏళ్ల నాటి కష్టం తీరింది. గతంలో ఓఆర్ఆర్ ఎగ్జిట్ 4 నుండి వచ్చే వారు ఈ అడ్డుగోడ వల్ల 8 కిలోమీటర్లు చుట్టూ తిరిగి ప్రయాణించాల్సి వచ్చేది. ఇప్పుడు ఆ దూరం కేవలం 3 కిలోమీటర్లకు తగ్గింది. మల్లంపేట విలేజ్, ప్రణీత్ లీఫ్ కాలనీ, ఆకాష్ వెంచర్, డ్రీమ్ వ్యాలీ, గ్రీన్ పార్క్, సాయినగర్, బృందావన్ కాలనీ, ఏపీఆర్ కాలనీ వంటి అనేక ప్రాంతాల వారికి ఇప్పుడు బాచుపల్లి చౌరస్తా మీదుగా ప్రగతినగర్‌కు సులభంగా చేరుకునే మార్గం దొరికింది.
తమది గేటెడ్ కమ్యూనిటీ అంటున్న ఆంటీలియా ఇంటి ఓనర్లు
ప్రణీత్ ఆంటిల్యా కమ్యూనిటీ నివాసితులు కూల్చివేతపై ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. తాము ఈ వెంచర్లో ఇళ్లు కొనుగోలు చేసినప్పుడు ఇది గేటెడ్ కమ్యూనిటీ అని చెబుతున్నారు. భద్రతా కారణాల దృష్ట్యా ప్రహరీ గోడ అవసరమని వాదిస్తున్నారు. అకస్మాత్తుగా గోడ తొలగించడం వల్ల కమ్యూనిటీ లోపల ప్రైవసీ దెబ్బతింటుందని, వాహనాల రద్దీ పెరిగి నివాసితులకు ఇబ్బందులు కలుగుతాయని వారు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. చట్టపరమైన అనుమతులతోనే తాము ఇక్కడ నివసిస్తున్నామని, ఈ విషయంలో తమకు న్యాయం జరగాలని కోరుతున్నారు.
