హైడ్రా వ్యవహారాలు వివాదాస్పదమవుతున్నాయి. చంద్రాయణ గుట్టలోని సల్కం చెరువు మధ్యలో ఉన్న ఓవైసీ బ్రదర్స్ కు చెందిన కాలేజీపై చాలా కాలం నుంచి వివాదం ఉంది. అప్పట్లో కాలేజీ చదువుల మధ్యలో ఉన్నాయి కాబట్టి హాలీడేస్లో ప్రత్యామ్నాయం చూసుకుంటారని.. కూల్చేస్తామని ప్రకటించారు. కానీ మళ్లీ కాలేజీలు స్టార్ట్ అయినా ఎలాంటి చ్రయలు తీసుకోలేదు. తాజాగా పిల్లల భవిష్యత్ దష్ట్యా కూల్చలేమని ప్రకటించేశారు.
హైడ్రా కమిషనర్ ఎ.వి. రంగనాథ్ 2025 జూలై 6న ప్రాథమిక పరిశీలనలో ఫాతిమా ఓవైసీ ఎడ్యుకేషనల్ క్యాంపస్ సల్కం చెరువు యొక్క ఫుల్ ట్యాంక్ లెవెల్ (FTL) పరిధిలో నిర్మితమైనట్లు తేలిందని ృప్రకటించారు. ఈ కాలేజీ దాదాపు 10,000 మంది అట్టడుగు ముస్లిం విద్యార్థులకు కిండర్ గార్టెన్ నుండి పోస్ట్-గ్రాడ్యుయేషన్ వరకు ఉచిత విద్యను అందిస్తుందని, సామాజిక ప్రభావం కారణంగా కూల్చివేతకు సంబంధించి తుది నోటిఫికేషన్ ఇంకా జారీ కాలేదని ప్రకటించారు.
2024 ఆగస్టు 28న కమిషనర్ రంగనాథ్, విద్యా సంవత్సరం మధ్యలో కూల్చివేత వల్ల విద్యార్థులు రోడ్డున పడకుండా ఉండేందుకు తాత్కాలిక సమయం ఇస్తామని, అయితే అక్రమ నిర్మాణాలను తొలగించకపోతే కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. ఓవైసీ అయినా, మల్లారెడ్డి అయినా, చట్టం అందరికీ ఒక్కటే అని ఆయన అన్నారు. అయితే ఇప్పుడు పిల్లల భవిష్యత్ కారణంగా కూల్చలేమని స్పష్టం చేస్తున్నారు. దీనిపై బీజేపీ సహజంగానే మండిపడుతోంది. ఓవైసీ జోలికి వెళ్లడం లేదని అంటున్నారు. అందరికీ ఒకే చట్టం వర్తించదా అని ప్రశ్నిస్తున్నారు. దీనికి ప్రభుత్వం సమాధానం చెప్పాల్సి ఉంది.