హైడ్రా రంగనాథ్ అంటే.. చెరువుల్ని కబ్జా చేసిన వారికి.. ప్రభుత్వ భూముల్ని కబ్జా చేసిన వారికి కలలోకి వస్తూంటారు. ఇప్పుడు ఆయన కొత్తగా అవినీతి అధికారులకు కూడా పెద్ద గండంగా మారారు. చెరువుల్ని కబ్జా చేయడానికి, ఎఫ్టీఎల్ పరిధిలో నిర్మాణాలకు అనుమతులు ఇచ్చిన అధికారులపై ఆయన ఏసీబీ అధికారులకు ఫిర్యాదు చేస్తున్నారు. అవినీతికి ఆధారాలిస్తున్నారు. దాంతో ఏసీబీ అధికారులు దాడులు చేస్తున్నారు.
రంగారెడ్డి జిల్లా ల్యాండ్ రికార్డ్స్ విభాగంలో ఉన్నతాధికారిగా పని చేస్తున్న శ్రీనివాసులపై ఏసీబీ దాడి చేసింది. ఆయనది అత్యంత లగ్డరీ లైఫ్. మోహోంభూజాలోని సొంత నివాసంలో ఉంటారు. ఆయన ఆస్తులు వంద కోట్లకుపైగానే లెక్క తేలాయి. బినామీ పేర్లతో రైస్ మిల్లులు కూడా నడుపుతున్నారు. ఆయన గురించి ఏసీబీకి సమాచారం ఇచ్చింది హైడ్రా అధికారి రంగనాథ్. కూకట్ పల్లి చెరువులో ఎఫ్ టీఎల్ నిర్మాణాలకు ఆయన..రికార్డులు మార్చి.. ట్యాంపర్ చేసి అనుమతులు ఇచ్చి లంచాలు తీసుకున్నారు. దీన్ని గుర్తించిన రంగనాథ్ ఏసీబీకి సమాచారం ఇచ్చారు. ఏసీబీ అధికారులు దాడులు చేసి అ లంచావతారాన్ని పట్టుకున్నారు.
కబ్జాకు గురి అయిన ప్రతి చెరువు విషయంలో రంగనాథ్ ఇలాగే వ్యవహరిస్తున్నారు. అక్రమ నిర్మాణాలు ఉంటే.. దానికి సహకరించిన అధికారులందరి జాబితాను రెడీ చేయిస్తున్నారు. వారి అవినీతిపై ఆరా తీసి.. ఏసీబీ అధికారులకు సమాచారం ఇస్తున్నారు. వారిపై ఏసీబీ అధికారులు దాడులు చేస్తున్నారు. అంటే.. ఇప్పుడు రంగనాథ్.. ఏసీబీ ఇన్ఫార్మర్ కూడా అనుకోవచ్చు.
