సినిమాలను పైరసీ చేసి ఆన్ లైన్ లో పెడుతున్న ఐ బొమ్మ రవికుమార్ ను సపోర్టు చేస్తూ కొంత మంది మాట్లాడుతున్నారు. ఆయనను రాబిన్ హుడ్గా పోలుస్తున్నారు. సినిమా టిక్కెట్ రేట్లు ఎక్కువగా ఉన్నాయని పైరసీని చూస్తున్నామని ఇలాంటి పైరసీని ఇస్తున్న రవికుమార్ ను రాబిన్ హుడ్గా పోలుస్తున్నారంటే.. దోపిడీలు, దొంగతనాలకు సమర్థన ఇస్తున్నట్లే. ఇలాంటి దోపిడీనే తమను చేస్తే తప్ప సమర్థించేవారికి నొప్పి తెలియదు. అన్నింటి కంటే మించి.. సినిమా నిత్యావసరం కాదు. దోపిడీ చేసి..ప్రాణాలు పోయేవాడి ప్రాణాలు కాపాడుతున్నామని చెప్పడానికి .
సినిమా వందల మంది కష్టం
సినిమాకు నిర్మాత ఒక్కడే ఉంటాడు.కానీ ఆ సినిమాకు పని చేసేవారు వందల మంది ఉంటారు. ఎంతో కష్టపడి ప్రజలకు కొత్త అనుభవాన్ని చూపించాలనుకుంటారు. ఇప్పుడు సినిమా నిర్మాణం ఎంత కష్టమే అందరికీ తెలుసు. అలాంటిది రిలీజ్ కాక ముందే పైరసీ చేసి లీక్ చేస్తే.. ఆ కష్టం అంతా బూడిదలో పోసినపన్నీరు కాదా ?. అప్పుడు రవి ఎవర్ని దోచుకున్నట్లు.. నిర్మాతనా.. కార్మికుల్నా?. ఆ నిర్మాత దివాలా తీస్తే.. ఇంకెవరు సినిమాలు తీస్తారు?. ఎవరికి ఉపాధి కల్పిస్తారు?. రవికుమార్ వీరందరి కష్టాన్ని దోచుకున్నాడు. అంతే ఎవరి కడుపు నింపలేదు.
రవికుమార్ చేసిన దొంగతనానికి అడ్డగోలు సమర్థనలా?
రవికుమార్ తాను చేసిన దొంగతనాన్ని సమర్థించుకోవడానికి విచిత్రమైన వాదన చేశారు. పోలీసులకు సవాల్ చేసినప్పుడు టిక్కెట్ రేట్ల గురించి చెప్పారు. టిక్కెట్ రేట్లు ఎంత ఉంటే ఆయనకేంటి?. బంగారం రేటు లక్షలకు చేరింది.. బంగారాన్ని దోపిడీ చేసేస్తాడా?. ఆ హక్కు ఆయన కు ఉన్నట్లేనా?. సినిమా అనేది తీసేవాడి కష్టం.. డబ్బులు పెట్టేవాడి శ్రమ. డబ్బులు వచ్చినా .. పోయినా వాళ్లకే. ఇతరులు దొంగతనం చేయడం దొంగతనమే. అతను చాలా టిక్కెట్ రేటు పెట్టాడు కాబట్టి కొట్టేస్తానంటే. అది దొంగతనం .. దొంగతనం కాకుండా పోదు.
సమర్థించేవారి శ్రమను అలా దోపిడీ చేస్తే?
రవికుమార్ ను మధ్యతరగతికి సినిమాలను ఉచితంగా చూపించేవాడిగా ప్రోజెక్ట్ చేస్తున్నారు. నిజంగా అలా ఉచితంగా చూసేవారు.. తాము చేసే కష్టాన్ని ఇతరులు ఇలాగే దొంగతనం చేసేసి.. ఇతరులకు పంచేస్తే.. ఎలా ఉంటుందో ఆలోచిస్తే అలాంటి పనులు చేయరు. తన ఆన్ లైన్ బ్యాంక్ అకౌంట్ల నుంచి డబ్బులు కొట్టేసి ఇతరులు అందరికీ పంచితే.. అది రాబిన్ హుడ్ యాక్ట్ అయిపోతుందా?. అలాగే ఇది కూడా. టిక్కెట్ రేట్లతో.. పాప్ కార్న్ రేట్లతో ముడిపెట్టి.. దొంగతనాన్ని సమర్థించలేరు. అలా చేయడం.. ప్రమాదకర మార్పు. ఇలా దొంగతనాలు చేసేవాళ్లు పెరుగుతారు. అప్పుడు సమర్థించేవారే బాధితులవుతారు.

