ఐబొమ్మ రవి నుంచి ఇంకా చాలా విషయాలు తెలుసుకోవాల్సి ఉందని పోలీసులు కోర్టులో మళ్లీ కస్టడీ పిటిషన్ వేసి మూడు రోజుల పాటు అనుమతి తెచ్చుకున్నారు. ఐబొమ్మ రవిని మరోసారి పోలీసు కస్టడీకి అనుమతిస్తూ నాంపల్లి కోర్టు ఆదేశాలిచ్చింది. ఇప్పటికే రవిని కోర్టు అనుమతితో రెండు సార్లు కస్టడీకి తీసుకున్న పోలీసులు మొత్తం ఎనిమిది రోజుల పాటు ప్రశ్నించారు. అన్ని రోజుల పాటు పోలీసుల నుంచి ప్రత్యేకమైన లీక్‌లు మీడియా వర్గాలకు లీకులు వచ్చేవి. సంచలన విషయాలు తెలుసుకున్నామని చెప్పేవారు. కానీ ఇప్పుడు ఇంకా తెలుసుకోవాల్సి ఉందని కస్టడీకి తీసుకున్నారు.
ఇప్పటి వరకూ ఐ బొమ్మ రవిపై నాలుగు వేరు వేరు కేసులు నమోదయ్యాయి. రవి నుండి తెలుసుకోవాల్సిన విషయాలు.. సేకరించాల్సిన ఆధారాలు ఇంకా ఉన్నాయని మరోసారి రవిని కస్టడీకి ఇవ్వాలని పోలీసులు అభ్యర్థించడంతో మరో మూడు రోజులపాటు కస్టడీకి అనుమతిస్తూ కోర్టు ఆదేశాలిచ్చింది. ఈ మూడు రోజులు కలిపితే మొత్తం పదకొండు రోజులు విచారించినట్లు అవుతుంది. ఇప్పటి వరకూ అత్యంత సంచలనం సృష్టించిన కేసుల్లో కూడా ఇన్ని రోజులు నిందితులను కస్టడీలోకి తీసుకున్న దాఖలాలు లేవు.
మరోవైపు రవి బెయిల్ పిటిషన్ పై విచారణ కొనసాగుతోంది. మూడు రోజుల కస్టడీకి ఇచ్చినందున బెయిల్ విచారణ వచ్చే సోమవారానికి వాయిదా పడింది. శనివారం ఉదయం రవిని చంచల్ గూడ జైలు నుండి పోలీసులు కస్టడీకి తీసుకోనున్నారు. మళ్లీ అవే లీకులు పోలీసుల నుంచి మీడియాకు వస్తాయి. గట్టి ఆధారాలు లభించి ఉంటే.. వాటిని కోర్టులో ప్రొడ్యూసర్ చేసి. బెయిల్ రాకుండా వాదించేవారని..కానీ సరైన ఆధారాలు లభించకపోవడం వల్లనే మళ్లీ మళ్లీ కస్టడీకి తీసుకొంటున్నారన్న ప్రచారం జరుగుతోంది.
