తెలంగాణ ప్రభుత్వ ప్రధాన కార్యదర్శిగా ఉన్న కె. రామకృష్ణారావు పదవీకాలాన్ని కేంద్ర ప్రభుత్వం మరో మూడు నెలల పాటు పొడిగించింది. వాస్తవానికి ఆయనకు గతంలోనే ఒక సారి ఏడు నెలల పాటు పొడిగింపు లభించినప్పటికీ, రాష్ట్ర ప్రభుత్వం చేసిన అభ్యర్థన మేరకు తాజాగా మరో మూడు నెలల పొడిగింపుకు ఆమోదం లభించింది. దీంతో ఆయన ఈ ఏడాది జూన్ చివరి వరకు రాష్ట్ర ప్రభుత్వ అత్యున్నత అధికార హోదాలో కొనసాగనున్నారు.
పదే పదే పొడిగింపు లభించదని ప్రభుత్వ పెద్దలు అనుకోవడంతో .. కొత్త సీఎస్‌గా జయేష్ రంజన్ పేరును ఖరారు చేస్తారన్న ప్రచారం జరిగింది. రాష్ట్రానికి భారీగా పెట్టుబడులు ఆకర్షించడంలో, పారిశ్రామిక రంగాన్ని పరుగులు పెట్టించడంలో కీలక పాత్ర పోషిస్తున్న జయేష్ రంజన్.. ప్రభుత్వ పెద్దల నమ్మకాన్ని పొందారు. ఇతర సీనియర్ అధికారుల కన్నా జయేష్ రేసులో ముందున్నారు. అయితే . రాష్ట్రానికి వచ్చే కొత్త ప్రాజెక్టులు, ఆర్థిక సంస్కరణల దృష్ట్యా ప్రస్తుతానికి ఆ మార్పు వాయిదా పడింది.
రాష్ట్ర ప్రభుత్వం ప్రస్తుతం ప్రతిష్టాత్మకంగా తీసుకున్న బడ్జెట్ రూపకల్పన, సంక్షేమ పథకాల అమలు, ఆర్థిక క్రమశిక్షణ వంటి అంశాల్లో రామకృష్ణారావుకు ఉన్న అపారమైన అనుభవం దృష్ట్యా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఆయననే కొనసాగించేందుకు మొగ్గు చూపినట్లు తెలుస్తోంది. కీలకమైన ఈ సమయంలో పాలనాపరమైన కొనసాగింపు ఉండాలని ప్రభుత్వం భావించడమే ఈ నిర్ణయానికి ప్రధాన కారణంగా కనిపిస్తోంది.


