విశాఖపట్నం ఐటీ రంగానికి పూర్వవైభవం తీసుకొచ్చే దిశగా ఒక కీలక పరిణామం చోటుచేసుకుంది. ప్రముఖ టెక్ దిగ్గజం IBM తిరిగి విశాఖలో అడుగుపెట్టేందుకు సిద్ధమవుతోంది. గతంలో హుద్‌హుద్ తుఫాను సమయంలో కార్యాలయం దెబ్బతినడంతో ఇక్కడి నుండి వెనుదిరిగిన ఐబీఎం, ఇప్పుడు మళ్ళీ తన కార్యకలాపాలను ప్రారంభించేందుకు ఆసక్తి చూపుతోంది. ఐబీఎం వంటి గ్లోబల్ కంపెనీ రాకతో విశాఖలో ఐటీ ఎకోసిస్టమ్ మరింత బలోపేతం కానుంది.
30 ఎకరాల్లో భారీ క్యాంపస్ నిర్మాణానికి నిర్ణయించారు. శాశ్వత ప్రాతిపదికన భూమి కేటాయింపు ప్రక్రియ పూర్తయ్యే వరకు వేచి చూడకుండా, తక్షణమే కార్యకలాపాలు మొదలుపెట్టాలని ఐబీఎం భావిస్తోంది. ఇందులో భాగంగా లాన్సమ్ స్క్వేర్ లో తాత్కాలికంగా కో-వర్కింగ్ స్పేస్ తీసుకోవడంపై అధికారులు చర్చలు జరుపుతున్నారు. కంపెనీ ప్రతినిధులు ఇప్పటికే ఆ ప్రాంగణాన్ని సందర్శించి, మౌలిక సదుపాయాలను పరిశీలించారు. ఈ తాత్కాలిక ఏర్పాటు ద్వారా వందలాది మంది సాఫ్ట్వేర్ నిపుణులకు త్వరలోనే ఉపాధి అవకాశాలు లభించే అవకాశం ఉంది.
ఐబీఎం పునరాగమనం విశాఖ ఐటీ రంగంలో కొత్త ఊపును తీసుకొస్తోంది. ఒకప్పుడు ఐటీ హబ్‌గా ఎదగాల్సిన విశాఖ ఇతర కారణాల వల్ల కొంత వెనుకబడినప్పటికీ, ఇప్పుడు గూగుల్ ఏఐ హబ్ తో పాటు అనేక దిగ్గజ సంస్థలు కార్యాలయాలు ప్రారంభిస్తున్నాయి. వాటితో పాటు ఐబీఎం వంటి సంస్థల రాకతో మళ్ళీ పెట్టుబడులకు కేరాఫ్ అడ్రస్‌గా మారుతోంది. ప్రభుత్వం కూడా సానుకూలంగా స్పందిస్తూ భూమి కేటాయింపు, ఇతర అనుమతులను వేగవంతం చేస్తామని హామీ ఇచ్చింది.
