ఐబొమ్మ రవికి కోర్టు బెయిల్ ఇచ్చింది. కానీ కఠినమైన షరతులు పెట్టింది. అందులో అత్యంత కీలకమైనది ఇంటర్నెట్ వాడవద్దు అనే షరతులు. ఇలాంటి షరతు బహుశా.. ఐబొమ్మ రవికి మాత్రమే పెట్టి ఉంటారు. ఈ కేసులో ప్రధానంగా రవి విదేశీ పౌరసత్వం కలిగి ఉండటం, సాక్ష్యాలను తారుమారు చేసే అవకాశం ఉండటంతో కోర్టు అత్యంత కఠినమైన ఆంక్షలను విధించింది.
ఒక ఐటీ నిపుణుడికి, పైరసీ నెట్‌వర్క్‌ను నడిపిన వ్యక్తికి ఇంటర్నెట్ లేకుండా ఉండటం అనేది ఒక రకమైన డిజిటల్ బహిష్కరణ ‘ లాంటిదే. సాంకేతిక పరిజ్ఞానంతో నేరాలకు పాల్పడే వ్యక్తుల విషయంలో ఇలాంటి షరతులు విధించవచ్చు కానీ.. అమలు చేయడం మాత్రం చాలా కష్టం. సైబర్ నేరగాళ్ల విషయంలో సుప్రీంకోర్టు మరియు హైకోర్టులు నేరానికి మూలమైన మాధ్యమాన్ని వాడకుండా నియంత్రించే అధికారం కోర్టులకు ఉంటుందని స్పష్టం చేశాయి. ఒకవేళ అత్యవసరంగా ఇంటర్నెట్ వాడాల్సి వస్తే పోలీసుల అనుమతి తప్పనిసరి అని స్పష్టం చేసింది.
రవి తన పాస్‌పోర్ట్‌ను కోర్టులో సరెండర్ చేయాలని, అనుమతి లేకుండా దేశం విడిచి వెళ్లకూడదని కోర్టు ఆదేశించింది. అలాగే, ప్రతిరోజూ హైదరాబాద్ సెంట్రల్ క్రైమ్ స్టేషన్ అధికారుల ముందు హాజరై సంతకం చేయాల్సి ఉంటుంది. పైరసీకి సంబంధించిన ఎలాంటి కార్యకలాపాల్లోనూ పాల్గొనకూడదని, విచారణకు పూర్తిస్థాయిలో సహకరించాలని న్యాయమూర్తి స్పష్టం చేశారు.
