సినిమా సంగీతాన్ని దాదాపు మూడు దశాబ్దాల పాటు డిక్టేటర్లా పాలించాడు ఇళయరాజా. ఆయనపై ఎలాంటి కాస్మిక్ ఎనర్జీ ప్రవహించేదో గాని ఆయన ముట్టుకున్న ప్రతి స్వరం శ్రోతల మనసుల్లో నాటుకుపోయేది. ఇప్పుడు ఎన్నో వైరల్ హిట్స్ వస్తున్నాయి. కోట్ల వ్యూస్ తెచ్చుకుంటున్నాయి. కానీ ఒక్క సంవత్సరంలోనే అవి ఫేడ్ అవుతున్నాయి. మళ్లీ వినాలంటే ఒక రకమైన అనాసక్తి. కానీ ఇళయరాజా పాటలకు ఒక గొప్ప గమ్మత్తు ఉంది. అవి ఎప్పటికీ బోర్ కొట్టవు. అందుకే చాలామంది ఫిల్మ్ మేకర్స్ తమ సినిమాల్లో ఇళయరాజా రిఫరెన్స్‌లు పెట్టుకుంటారు. ఎక్కడో ఒక చిన్న పాటైనా వాడుకుంటారు. దీనికి కారణం ఆయన సంగీతం కల్చర్, జీవితంలో కలిసిపోయింది.
అయితే ఇంత స్వర సముద్రాన్ని సృష్టించిన ఇళయరాజా తన హక్కుల విషయంలో మాత్రం ఒక డిక్టేటర్లా ప్రవర్తిస్తుంటారు. మామూలుగా పాటలు వింటే ఓకే గాని కమర్షియల్ ఫార్మాట్లో ఆయన స్వరపరిచిన చిన్న బిట్ వినిపించినా ఇక చుక్కలే. తన పాటలకు కాపీరైట్ చట్టాన్ని చాలా బలంగా రాసుకున్నారు రాజా. ఇప్పటికీ చాలా కేసుల్లో నెగ్గారు. చిన్న బిట్ వాడినా కాపీరైట్ స్ట్రైక్ పిడుగులా వచ్చి పడుతుంది.
లేటెస్ట్గా ఏకంగా నెట్‌ఫ్లిక్స్ నుంచి ఒక సినిమానే తీయించేశారు రాజా. అజిత్ హీరోగా వచ్చిన గుడ్ బ్యాడ్ అగ్లీ సినిమాలో వాడిన ఇళయరాజా పాటలే పెద్ద చిక్కు తెచ్చిపెట్టాయి. ఆ విషయంలో కాపీరైట్ నోటీసులు జారీ చేసిన ఇళయరాజా, మరి నిర్మాతలతో ఆయనకి సరైన ఒప్పందం కుదిరిందో లేదో తెలియదు కానీ ఆ సినిమాను పూర్తిగా ప్లాట్‌ఫామ్ నుంచి తొలగించేంతవరకు ఊరుకోలేదు. ఇప్పుడు ఆ సినిమా నెట్‌ఫ్లిక్స్‌లో లేదు.
ఎన్నో మృదువైన పాటలనే స్వరపరిచిన ఇళయరాజా, కాపీరైట్ విషయంలో మాత్రం చాలా కర్కశంగా ఉంటున్నారనేది స్వర సత్యం. ఇకపై నిర్మాతలు కూడా కాస్త జాగ్రత్తగా ఉండటమే మంచిది. ఆయన మ్యూజిక్ ఏదో ప్రైవేట్‌గా మ్యూజిక్ యాప్స్‌లో వింటూ సరదాగా గడపడం తప్పితే సినిమాలో పెట్టుకుంటామని ఆలోచన వస్తే మాత్రం ఇలానే అనవసరమైన చిక్కులను ఎదుర్కోవాల్సి ఉంటుంది.