ఇళయరాజా మరోసారి సంగీత హక్కుల వార్తల్లో నిలిచారు. ఆయన తాజాగా సోనీ మ్యూజిక్ సంస్థపై ఫిర్యాదు చేశారు. తాను కంపోజ్ చేసిన “కరుత మచాన్’ పాటను “డ్యూడ్” సినిమాలో ఇంటర్వల్ సీన్లో అనుమతి లేకుండా వాడారని ఆరోపించారు. ఆ పాటను సినిమాలో వాడే ముందు సోనీ మ్యూజిక్, సినిమా బృందం ఎవ్వరూ ఆయనతో సంప్రదించలేదని, అలాగే చట్టపరమైన హక్కులు కూడా పొందలేదని చెప్పారు. తన హక్కులు ఉల్లంఘించబడటం పట్ల ఇళయరాజా తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేశారు.
రాజా గతంలో కూడా పలు సందర్భాల్లో తన ట్యూన్స్ కాపీరైట్ ఉల్లంఘనలు జరగడం గురించి పోరాటం చేశారు. ఈసారి కూడా ఆయన తన పాటలు అనుమతి లేకుండా వాడటం సరైంది కాదని హెచ్చరించారు. మరి సోనీ మ్యూజిక్ ఈ ఫిర్యాదుపై ఎలా స్పందిస్తుందో, ఈ వివాదం ఏ దిశగా సాగుతుందో చూడాలి. మొత్తానికి సంగీతానికి రాజు అయిన ఇళయరాజా… హక్కుల విషయంలో మాత్రం రాజీ పడరని మరోసారి నిరూపించారు.