ఇళయరాజా అందరిపైనా కేసులు వేయడమే కానీ, ఇళయరాజాపై మరొకరు కేసు వేయడం చూశారా? ఇప్పుడు అదే జరిగింది. ‘సరిగమ’ సంస్థ ఇళయరాజాపై కేసు వేసింది. ఢిల్లీ కోర్టు నుంచి ఆర్డర్లు తెచ్చుకొంది. తమ ఆధీనంలో ఉన్న వందకు పైగా సినిమాలకు సంబంధించిన పాటల్ని ఎక్కడా వాడుకోవడానికి వీల్లేదని ఇళయరాజాపై ఆంక్షలు విధించేలా చేసింది. నిజంగా ఇళయరాజాకు ఇది పెద్ద షాకే.
ఇళయరాజా గొప్ప సంగీత దర్శకుడు. తరాలకు గుర్తుండిపోయే స్వరాలు అందించిన సంగీత మేధావి. ఆయన పాటలు ఓదార్పు, ఊరడింపు. ఇళయరాజా పాటంటే అభిమానులు పడిచచ్చిపోతారు. ఇదంతా ఓకే. కానీ.. ఇళయరాజా దగ్గర మా చెడ్డ అలవాటు ఒకటుంది. ఆయన పాటలు ఎవరైనా ఎక్కడైనా వాడితే ఆయనకు ఏమాత్రం నచ్చదు. ఆఖరికి ఆ పాట పాడిన ఎస్.పి.బాలసుబ్రహ్మణ్యం కచేరీ చేసినా – ఇళయరాజా అనుమతి తీసుకోవాలి. లేదంటే ఆయనకు రైట్స్ రూపంలో కొంత మొత్తం చెల్లించాలి. పబ్లుల్లో కూడా ఇళయరాజా పాట అనుమతి లేకుండా పాడడం నిషిద్ధమే. ఓ సినిమాలో ఇళయరాజా పాటని రీమిక్స్ చేస్తే.. తప్పకుండా ఇళయరాజా అనుమతి తీసుకోవాలి. ఆయనకు కొంత చెల్లించాలి. ఇందులో ఎలాంటి ఇబ్బంది లేదు. సదరు పాటతో సినిమాకు ఏదో ఓ రూపంలో ఆదాయం వస్తుంది కాబట్టి స్వరకర్తకు కొంత మొత్తం ఇవ్వడంలో తప్పేం లేదు. కానీ… బ్యాక్ గ్రౌండ్ లో ఓ పాట వినిపించినా, బీజియం వాడినా, రేడియోలో, టీవీలో ఇళయరాజా పాత పాట కనిపించినా – వినిపించినా దానిక్కూడా ఇళయరాజా కాపీ రైట్ వేయడం చాలామంది నిర్మాతల్ని ఇబ్బంది కలిగించింది. అంతెందుకు… తన సినిమాలోని పాట మళ్లీ తానే వాడుకోవాల్సిన వచ్చినా, ఆ పాట ఇళయరాజాది అయితే సదరు నిర్మాత మళ్లీ ఇళయరాజా దగ్గరకు వెళ్లి అనుమతి తీసుకోవాల్సిందే. ఆడియో సంస్థలకు కూడా ఇదే కండీషన్. దాంతో నిర్మాతలు, ఆడియో కంపెనీ అధినేతలూ విసిగిపోయారు. అందుకే ఇప్పుడు కొంతమంది నిర్మాతలు ‘సరిగమ’ ఆడియో కంపెనీకి తమ సినిమాలకు సంబంధించిన పాటల హక్కుల్ని అమ్మేశారు. ఇప్పుడు ఆ పాటలు ఇళయరాజా వాడకుండా కండీషన్ పెట్టారు. ఎప్పుడైతే తన సినిమాల పాటలు సరిగమ చేతికి వెళ్లాయని తెలిసిందో.. అప్పుడే ఆ పాటలకు సంబంధించిన ప్రసార హక్కుల్ని పలు సంస్థలు ఇళయరాజా రాసి ఇవ్వడం సరిగమ దృష్టికి వెళ్లింది. దాంతో సరిగమ కోర్టుని ఆశ్రయించింది. ఇప్పుడు ఈ పాటల్ని సరిగమ అనుమతి లేకుండా ఎక్కడా వాడడానికి వీల్లేదు. ఆఖరికి ఇళయరాజా సైతం ఈ పాటల్ని వాడుకోవాలంటే ‘సరిగమ’ పర్మిషన్ తప్పని సరి. ఇది ఇళయరాజాకు మింగుడు పడని వ్యవహారమే. ఇళయరాజా కచ్చేరీల్లోనూ ఈ పాటలు వినిపించకూడదన్నది అతి ముఖ్యమైన కండీషన్.
ఇళయరాజాకు ఇప్పుడు కొత్తగా ఆస్తుల్ని కూడబెట్టాల్సిన అవసరం లేదు. తన పేరు కోసం పాకులాడాల్సిన అగత్యం లేదు. ఇళయరాజా పాట పాడుకోవడం, వినడం, తెరపై చూసుకోవడం అనేవి అరుదైన జ్ఞాపకాలు. ఆ అనుభూతుల్ని ఈతరం కూడా ఆస్వాదించాలి. అప్పుడే ఇళయరాజా పేరు, గౌరవం మరింత ఇనుమడిస్తాయి. తన పాట వాడుకోవడం తనకు గౌరవంలా భావించాలి ఇళయరాజా. అలాకాకుండా ప్రతీ పాటనీ రూపాయిలతో ముడి పెట్టి చూస్తే – ఇలాంటి పరిణామాలే ఎదురవుతాయి.
