ఇన్సూరెన్స్ ఇప్పుడు ప్రతి ఆస్తికి అవసరమే. ఇంటికీ అవసరమే. చాలా మంది హోంలోన్ తీసుకున్నప్పుడు తమకు ఏమైనా జరిగి హోమ్ లోన్ కట్టలేని పరిస్థితి వస్తే రక్షణ కోసం బీమా తీసుకుంటారు. కానీ ఇంటికి మాత్రం తీసుకోరు. ఇంటికి బీమా కూడా చాలా ముఖ్యమే. ప్రకృతి విపత్తులు, అగ్నిప్రమాదాలు, దొంగతనాలు వంటి అనూహ్య సంఘటనల నుంచి ఇంటికి రక్షణ పొందడంలో బీమా కీలకం. భారతదేశంలో కేవలం 1 శాతం మంది మాత్రమే ఇంటి బీమాను కలిగి ఉన్నారు.
ఇంటి బీమా కేవలం ఇంటి నిర్మాణాన్ని మాత్రమే కాకుండా, లోపలి వస్తువులు, మూడవ వ్యక్తుల బాధ్యతలు, తాత్కాలిక వసతి ఖర్చులు వంటివి కూడా కవర్ చేస్తుంది . నభారతదేశంలో ఇంటి బీమా చట్టపరంగా తప్పనిసరి కాదు, కానీ ఇది ఆర్థిక భద్రతకు అవసరమైనది. వరదలు, భూకంపాలు, తుఫానులు వంటి ప్రకృతి విపత్తుల నుంచి రక్షణ కల్పించడం ద్వారా ఇది ఇంటి యజమానులకు మానసిక ప్రశాంతతను అందిస్తుంది.
తక్కువ ధరలో ఇంటి బీమాను అందించే కంపెనీలు భారతదేశంలో అనేకం ఉన్నాయి. క్లెయిమ్ సెటిల్మెంట్ రేటు, కస్టమర్ సర్వీస్ ఆధారంగా బీమా కంపెనీని ఎంపిక చేసుకోవచ్చు. మన దేశంలో బీమా ఖర్చును ఆదాయం లేనిఖర్చుగా చాలా మంది భావిస్తూ ఉంటారు. ఇంకా లైఫ్ , హెల్త్ ఇన్సూరెన్స్ ల విషయంలోనే పూర్తిగా అవగాహనకు రాలేదన్న అభిప్రాయం ఉంది. అందుకే హోమ్ ఇన్సూరెన్స్ పుంజుకోవడం కష్టమే.కానీ ప్రయోజనాలను గుర్తించిన వారు మాత్రం వదిలి పెట్టరు.