ఒకేరోజు రెండు అపురూప భేటీలు-ఆసక్తికర చర్చ

హైదరాబాద్: నిన్న హైదరాబాద్‌లో ఒకేరోజు జరిగిన రెండు అరుదైన భేటీలు తెలుగు రాష్ట్రాలలో చర్చనీయాంశాలుగా మారాయి. ఒకటేమో పాత గురు శిష్యుల పునస్సమాగమం అయితే, మరొకటేమో అన్నదమ్ములమధ్య ఆత్మీయ కలయిక. ఈ రెండు అపురూప భేటీలు ఈ పండగ సీజన్‌లో రెండు రాష్ట్రాలలో సుహృద్భావ వాతావరణాన్ని సృష్టించాయి.

ఓటుకు నోటు కేసు బయటపడినప్పటినుంచి చంద్రబాబునాయుడు, కేసీఆర్ ఉప్పు, నిప్పుగా ఉంటున్న సంగతి తెలిసిందే. అయితే చంద్రబాబునాయుడు ఒక మెట్టు దిగి కేసీఆర్ ఇంటికి వెళ్ళటం రెండు రాష్ట్రాల మధ్య ఉన్న ఉద్విగ్న పరిస్థితులను చల్లబరిచినట్లయింది. ఇద్దరు చంద్రులూ విభేదాలను పక్కనపెట్టి ఆత్మీయంగా పలకరించుకుంటున్న దృశ్యం తెలుగువారందరికీ హాయిగా అనిపించిందనే చెప్పాలి. బాబును కారు దిగినదగ్గరే రిసీవ్ చేసుకున్న కేసీఆర్ ఆత్మీయంగా తోడ్కొని లోపలకు తీసుకెళ్ళారు. అక్కడ ఇద్దరినీ చూస్తే, చంద్రబాబు చాలా క్యాజువల్‌గా ఉండగా, కేసీఆర్ మాత్రం కొద్దిగా ఉద్వేగంగా కనిపించారు. ఒకనాటి బాస్‌తో సరితూగే స్థాయికి చేరుకున్నానన్న ఫీలింగ్ లోలోపల కొట్టుమిట్టాడుతుండొచ్చు. ఇక 50 నిమిషాలపాటు సాగిన సమావేశంలో ఇరువురు నేతలూ పలు అంశాలపై విస్తృతంగా చర్చించారని తెలిసిందే. ఇద్దరికీ వాస్తు అభిమానమైన అంశం కావటంతో దానిపై కొద్ది సేపు, నదుల అనుసంధానంపై కొద్దిసేపు చర్చలు జరిగినట్లు సమాచారం. ఇక కార్యక్రమానికి తాను తప్పక హాజరవుతానని, 21న సూర్యాపేటలో కార్యక్రమాలున్నాయని ఆ రాత్రి అక్కడే బస చేసి ఉదయాన్నే రోడ్డుమార్గంలో అమరావతికి వస్తానని కేసీఆర్ చెప్పగా, అవసరమైతే సూర్యాపేటకు హెలికాప్టర్ పంపుతానని బాబు చెప్పారట. అయితే తెలంగాణ వస్తే కనకదుర్గమ్మకు ముక్కుపుడక చేయిస్తానని తాను గతంలో చేసిన మొక్కు తీర్చాల్సి ఉందని అదికూడా తీర్చుకుని కార్యక్రమానికి వచ్చేటట్లు ప్లాన్ చేస్తానని కేసీఆర్ చెప్పినట్లు తెలిసింది. ఏది ఏమైనా ఈ భేటీ రెండు రాష్ట్రాలమధ్య అనేక విషయాలలో ఏర్పడిన ప్రతిష్ఠంభనకు తెరదించితే బాగుంటుంది.

రాజకీయంగా భిన్న ధృవాలలా ఉన్న అన్నదమ్ములు చిరంజీవి, పవన్ నిన్న ప్రత్యేకంగా భేటీకావటం మరో అపురూప ఘట్టం. అన్నదమ్ములమధ్య తీవ్ర విభేదాలు ఏర్పడ్డాయని, అందుకే నాగబాబు పవన్ ఫ్యాన్స్‌ను బూతులు తిట్టారని, ఈ విభేదాల కారణంగా బ్రూస్‌లీ సినిమా అంచనాలస్థాయిలో ఆడటంలేదని అనేక వాదనలు వినిపిస్తున్న నేపథ్యంలో వీరి కలయికకు ప్రాధాన్యం ఏర్పడింది. సర్దార్ గబ్బర్ సింగ్ గెటప్‌లో ఉన్న పవన్ అలాగే అన్నయ్య ఇంటికి వెళ్ళారు. అన్నయ్యకు పుష్పగుచ్ఛం ఇచ్చి అభినందించారు. తర్వాత కెమేరాలకోసం చిరంజీవి, పవన్, చరణ్ పోజులిచ్చారు. తను ఈ స్థాయిలో ఉండటానికి, తను సినిమాల్లోకి రావటానికి కారణం అన్నయ్యేనని, అన్నయ్య రీఎంట్రీ సందర్భంగా అభిమానులందరి తరపున అభినందనలు తెలపటానికి వచ్చానని పవన్ చెప్పారు. పవన్ రావటంతో అన్నయ్య చిరంజీవి ముఖం వందవాట్ల బల్బులా వెలిగిపోవటం స్పష్టంగా కనిపించింది. ఒకప్పుడు అన్నయ్య ఎదురుగా నించోవటానికి భయపడే పవన్, ఇప్పుడు పక్కన కూర్చుని క్యాజువల్‌గా కబుర్లు చెబుతుంటే చిరంజీవిమాత్రం ఉద్వేగంగా కనిపించటం విశేషం. రాజకీయంగా పవన్ ఒకరకంగా తనను మించిపోవటం కారణమయిఉండొచ్చు.

ఈ భేటీల మీద రకరకాల వ్యాఖ్యానాలు, విశ్లేషణలు వినిపిస్తున్నాయి. ఓటుకు నోటు కేసులో రాజీపడటంకోసమే బాబు కేసీఆర్ దగ్గరకు వెళ్ళారని, రాజీ పడిపోయారని మొదటి భేటీ గురించి, చిరు-పవన్ కలిసిపోయారని, చిరంజీవికూడా బీజేపీలో చేరతారని రెండో భేటీగురించి ఎవరికి తోచినట్లు వారు వాదిస్తున్నారు. ఏది ఏమైనా ఈ రెండు భేటీలను ప్రస్తుతానికి ఒక సానుకూల కోణంలో చూస్తేనే బాగుంటుంది.

Telugu360 is always open for the best and bright journalists. If you are interested in full-time or freelance, email us at Krishna@telugu360.com