తెలంగాణలో అసెంబ్లీ నియోజకవర్గాల పెంపుదల కోసం తీవ్రంగా ప్రయత్నించాలని కేసీఆర్ బృందం భావిస్తోంది. జిల్లాల సంఖ్యను అమాంతం మూడు రెట్లు పెంచడం, మండలాల సంఖ్యను కూడా భారీగా పెంచడం ద్వారా వేల మంది తెరాస నేతలు, కార్యకర్తలకు పార్టీ పదవులు కట్టబెట్టే అవకాశం వచ్చింది. అయితే ఇతర పార్టీల నుంచి పెద్ద సంఖ్యలో వలస వచ్చిన వారికి వచ్చే ఎన్నికల్లో సీట్లు సర్దుబాటు చేయాలంటే నియోజకవర్గాల పెంపు తప్పనిసరి అని తెరాన నాయకులు భావిస్తున్నారు. అయితే ఇప్పట్లో అది జరిగే అవకాశాలు లేవన్నది ఢిల్లీ సమాచారం.
ఏపీ పునర్విభజన చట్టం ప్రకారం తెలంగాణలో ఇప్పుడు 119 శాసనసభా స్థానాలను 153కు పెంచాలి. అలాగే ఏపీలో 175 సీట్లను 225కు పెంచాలి. సాధారణంగా అయితే 2025 వరకూ దేశంలో సీట్ల సంఖ్యను పెంచే అవకాశం లేదు. చిన్న రాష్ట్రం అనే కోణంలో సీట్ల పెంపుదలకు కేంద్రంపై ఒత్తిడి తీసుకు రావడానికి ఇక తెరాస ఎంపీలు సిద్ధమవుతున్నారు. కేంద్ర మంత్రులతో మాట్లాడటం, వీలైనంత మేరకు కేంద్రంపై ఒత్తిడి తేవడం ఇక ఎంపీల పని.
ముఖ్యమంత్రి కేసీఆర్ కూడా నేరుగా ప్రధాని మోడీ దగ్గరే ఈ విషయం ప్రస్తావించడానికి రెడీ అవుతున్నారు. నియోజకర్గాలను పెంచకపోతే వచ్చే ఎన్నికల్లో తెరాసకు తలనొప్పులు తప్పక పోవచ్చు. ఇతర పార్టీల నుంచి పెద్ద సంఖ్యలో ఎమ్మెల్యే, ఇతర నాయకులు కారెక్కారు. వాళ్లలోచాలా మందికి కేసీఆర్ ఏదో ఒక హామీ ఇచ్చారని సమాచారం. కొన్ని చోట్ల ఒకే నియోజకర్గం టికెట్ ను ఇద్దరి కంటే ఎక్కువ మంది ఆశించే పరిస్థితి ఉంది.
ఈ పరిస్థితుల్లో నియోజకవర్గాల పెంపుదలకు ఒత్తిడి వ్యూహం అనుసరించమే మార్గమంటున్నారు తెరాస నేతలు. ఓ ఏడాదిలోగా కేంద్రాన్ని ఒప్పించ గలిగితే, 2019 ఎన్నికల నాటికి సీట్ల పెంపు ప్రక్రియ కొలిక్కి రావచ్చు. దానికి కచ్చితంగా సమయం పడుతుంది. కాబట్టి కాలాతీతం కాకుండా త్వరగా కేంద్రాన్ని కన్విన్స్ చేయడమే ఇప్పుడు తెరాస ఎంపీల తక్షణ కర్తవ్యమట. అయితే తెలంగాణ, ఏపీతో పాటు ఇతర రాష్ట్రాల్లో సీట్ల సంఖ్య పెంపుదలపై కేంద్రం హడావుడి పడే స్థితిలో లేదని సమాచారం.