ఆసియా కప్ లో భాగంగా ఈరోజు ఇండియా – పాకిస్థాన్ తలపడబోతున్నాయి. మామూలుగా అయితే.. ఇలాంటి మ్యాచ్ కోసమే క్రికెట్ అభిమానులు ఆసక్తిగా ఎదురు చూస్తుంటారు. పాక్ తో తలపడినప్పుడు, పాక్ ని ఓడించినప్పుడు మనకు పండగే! కానీ ఈ మ్యాచ్ పై అలాంటి ఆసక్తి లేదు. ఇరు దేశాల మధ్య ఉదృక్తమైన వాతావరణం నెలకొన్నప్పుడు మ్యాచ్‌లు ఆడడం అవసరమా? అనేది సగటు భారతీయుడి ప్రశ్న.
పహల్గాం దాడి, ఆపరేషన్ సింధూర్ తరవాత భారత్ – పాక్ మధ్య సంబంధాలు మరింతగా దెబ్బతిన్నాయి. ఇలాంటి దశలో క్రికెట్ ఆడడం అవసరమా? అనేది అందరి వాదన. అందుకే ఈ మ్యాచ్‌ని ‘బాయ్ కాట్’ చేయమంటూ.. సోషల్ మీడియాలో క్యాంపెయిన్లు నిర్వహిస్తున్నారు. కానీ బీసీసీఐకి ఇవేం పట్టడం లేదు. ఈ మ్యాచ్ ద్వారా బీసీసీఐకి భారీ ఆదాయం లభిస్తుంది. దాన్ని వదులుకోవడానికి బోర్డు సిద్ధంగా లేదు.
బీసీసీఐతో పాటుగా పాక్ క్రికెట్ బోర్డుకు కూడా ఈ మ్యాచ్ కాసుల వర్షం కురిపిస్తుంది. అసలే పాక్ బోర్డు తీవ్ర నష్టాల్లో ఉంది. ఈ మ్యాచ్ జరక్కపోతే.. మరింత దీనమైన స్థితిలో చేరుకొంటుంది. అందుకే పాక్ సైతం ఈ మ్యాచ్ ఎలాగైనా ఆడాలనే అనుకొంది. అయితే ఈ మ్యాచ్‌తో పాక్ కి వచ్చే ఆదాయంతో… ఆయుధాలు కొనుగోలు చేసి, మళ్లీ భారత్ పైనే దాడి చేయడానికి పూనుకొంటోందని, అంటే మనపై దాడి చేయడానికి పాక్‌కి మనమే డబ్బులు సమకూరుస్తున్నామని… చాలామంది వాదిస్తున్నారు. అంతర్జాతీయ క్రికెట్ ఆడితే.. ఐసీసీఐ డాలర్ల రూపంలో ఆదాయాన్ని వివిధ బోర్డులకు మళ్లిస్తుంటుంది. పాక్ బోర్డుకూ డాలర్ల రూపంలోనే ఆదాయం అందుతుంది. ఆ డాలర్లతోనే పాక్ ఆయుధాల్ని కొనుగోలు చేస్తుందన్న ఓ వాదన బలంగా వినిపిస్తోంది.
అయితే క్రికెట్ వర్గాల అభిప్రాయం మరోలా ఉంది. పాక్ తో మ్యాచ్ ఆడమంటే పాయింట్లు కోల్పోతామని, దాని వల్ల ఆసియా కప్ లాంటి ప్రతిష్టాత్మక టోర్నీలో భారత్ వెనుకబడే అవకాశం ఉందని, సెమీస్, ఫైనల్ లో పాక్ తో తలపడాల్సివస్తే, అప్పుడు కూడా బాయ్ కాట్ చేస్తే.. పాక్ తో తలపడలేకే ఈ దొడ్డిదారి ఎంచుకొన్నారన్న విమర్శలు వస్తాయని, అందుకే భారత్ ఈ మ్యాచ్‌ని మ్యాచ్‌గా మాత్రమే చూస్తోందని చెబుతున్నారు.
ఒక్కటి మాత్రం నిజం. బీసీసీఐ తనకు ఆదాయం వచ్చే ఏ చిన్న అవకాశాన్నీ వదులుకోదు. భారత్ – పాక్ మ్యాచ్ అంటే.. బీసీసీఐకి పండగే. దాన్ని ఎలాగైనా క్యాష్ చేసుకోవాలని చూస్తుంది. ఆసియా కప్ లాంటి టోర్నీ భారత్ ఆడకపోతే ఇప్పుడు నష్టమేంటి? వరల్డ్ కప్ గెలిచిన జట్టు – భయపడిందని ఎవరైనా అనుకొంటారా? పాక్ తో ఆడం.. అనే ఓ నిర్ణయానికి వస్తే.. మనకు నష్టం ఏం లేదు. పాక్ బోర్డే అతలాకుతలం అవుతుంది. ఓరకంగా ప్రత్యర్థిని పరోక్షంగా దెబ్బకొట్టినట్టు అవుతుంది. ఆ అవకాశం భారత్ చేజార్చుకొంది. కాకపోతే ఒకటి.. పాక్ తో పోరు అంటే గతంలో ఉన్న ఆసక్తి ఇప్పుడైతే లేదు. ఒకవేళ పాక్ పై గెలిస్తే అప్పుడు అసలైన జోష్ బయటకు వస్తుందేమో చూడాలి.